మానసిక సామర్థ్యాలను తగ్గించే ధూమపానం

సిగరెట్‌ తాగే అలవాటుతో అరవై ఏళ్లు, అంతకు పైబడిన వయసు కలవారిలో మానసిక సామర్థ్యాలు సన్నగిల్లుతాయని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.

Published : 20 Jan 2023 06:27 IST

సిగరెట్‌ తాగే అలవాటుతో అరవై ఏళ్లు, అంతకు పైబడిన వయసు కలవారిలో మానసిక సామర్థ్యాలు సన్నగిల్లుతాయని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఈ మేరకు వెయిల్‌ కార్నెల్‌ మెడిసిన్‌, న్యూయార్క్‌-ప్రెస్బిటేరియన్‌ పరిశోధకులు వెల్లడించారు. వారి అధ్యయన ఫలితాలు గతేడాది డిసెంబరు 6న జర్నల్‌ ఆఫ్‌ అల్జీమర్స్‌ డిసీజ్‌లో ప్రచురితమయ్యాయి. ధూమపానం, మధుమేహం, హైపర్‌టెన్షన్‌ మెదడు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ కారకాలన్నీ ఏకమైనప్పుడు మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే కరోటిడ్‌ ధమనికి చెందిన అథ్లెస్క్లోరోటిక్‌ గట్టిపడటం వంటి బ్రెయిన్‌ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని మునుపటి అధ్యయనాలు తేల్చాయి. తాజా పరిశోధనలో ధూమపానం, మధుమేహం, హైపర్‌టెన్షన్‌లు కలగలసినప్పుడు మానసిక సామర్థ్యాలు దిగజారుతాయని తేలింది. ఇటువంటి సందర్భాల్లో రోగులకు ఎదురయ్యే అదనపు అధిక ప్రమాద స్థితిపై వారికి సూచనలివ్వొచ్చని తెలిపింది. అధ్యయనం సందర్భంగా 60 ఏళ్లు, అంతకు మించి వయసు కలిగిన 3007 మంది ఆరోగ్య సమాచారాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో ధూమపానం అలవాటును వదులుకొనేలా ప్రోత్సహించడం ద్వారా వ్యక్తుల్లో చక్కని ఆలోచనలు, నేర్చుకునే..గుర్తుపెట్టుకోగల శక్తి వంటి సామర్థ్యాలను కాపాడవచ్చని పరిశోధకులు తేల్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని