నాసా-ఇస్రో ఉపగ్రహం సిద్ధం

భూమిపై పరిశీలనల కోసం అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా, భారత్‌ రోదసి పరిశోధన సంస్థ (ఇస్రో)లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘నిసార్‌’ ఉపగ్రహం పూర్తిస్థాయిలో సిద్ధమైంది.

Updated : 05 Feb 2023 04:50 IST

త్వరలో భారత్‌కు తరలింపు

వాషింగ్టన్‌: భూమిపై పరిశీలనల కోసం అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా, భారత్‌ రోదసి పరిశోధన సంస్థ (ఇస్రో)లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘నిసార్‌’ ఉపగ్రహం పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఈ నెలలోనే దీన్ని భారత్‌కు పంపనున్నారు. సెప్టెంబర్‌లో ఇది అంతరిక్షంలోకి పయనం కానుంది. తాజాగా ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమ్‌నాథ్‌ కాలిఫోర్నియాలోని నాసా జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబ్‌ (జేపీఎల్‌)ను సందర్శించారు. ‘నిసార్‌’పై జరుగుతున్న తుది పరీక్షలను పర్యవేక్షించారు. ఈ ఉపగ్రహాన్ని భారత్‌కు పంపుతున్న నేపథ్యంలో ల్యాబ్‌లో జరిగిన ఒక వేడుకలో ఆయన పాల్గొన్నారు. లాంఛనంగా కొబ్బరికాయలు కూడా కొట్టారు. ఈ సందర్భంగా సోమ్‌నాథ్‌ మాట్లాడుతూ.. ‘‘శక్తిమంతమైన సైన్స్‌ పరిశోధన సాధనంగా రాడార్‌ ఉపయోగపడుతుందని చాటడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది. భూ ఉపరితలం, మంచు గురించి మరింత నిశితంగా శోధించడానికి వీలు కల్పిస్తుంది’’ అని తెలిపారు. ఇది చాలా సంక్లిష్టమైన ఉపగ్రహమన్నారు. మారుతున్న వాతావరణాన్ని, భూమిని మెరుగ్గా అర్థం చేసుకోవడానికి భారత్‌, అమెరికా ఉమ్మడిగా సాగిస్తున్న ప్రయాణంలో ఇదో మైలురాయి అని జేపీఎల్‌ డైరెక్టర్‌ లారీ లెషిన్‌ పేర్కొన్నారు.

నిసార్‌ ప్రాజెక్టును ఇరు దేశాల అంతరిక్ష సంస్థలు 2014లో చేపట్టాయి. ఈ ఉపగ్రహం బరువు 2,800 కిలోలు. దీనికోసం నిర్మించిన ఎస్‌-బ్యాండ్‌ సింథటిక్‌ అపెర్చర్‌ రాడార్‌ (సార్‌)ను భారత్‌.. 2021 మార్చిలో అమెరికా పంపింది. నాసా రూపొందించిన ఎల్‌ బ్యాండ్‌ సాధనంతో దీన్ని అనుసంధానించారు. భూకంపాలు, కొండచరియలు విరిగిపడటానికి, అగ్నిపర్వత విస్ఫోటాలకు ముందు పరిసరాల్లో  చోటుచేసుకునే చిన్నపాటి వైరుధ్యాలను ఈ ఉపగ్రహం గుర్తిస్తుంది. జోషీమఠ్‌ తరహాలో భూమి కుంగడం లాంటి ప్రకృతి విపత్తులను ముందే పసిగట్టడానికి ఇది సాయపడుతుంది. రాత్రివేళల్లో, అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్లోనూ పరిశీలనలు సాగించగలదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని