చలో సింగపూర్‌ అంటున్న చైనా కుబేరులు

చైనా కుబేరుల్లో కొత్త భయాలు నెలకొన్నాయి. అక్కడే ఉంటే తమ సంపదకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందన్న భయంతో పన్ను రాయితీలకు స్వర్గధామమైన సింగపూర్‌కు మకాం మార్చేస్తున్నారు.

Updated : 05 Feb 2023 05:32 IST

జాక్‌మా ఉదంతంతో భయాందోళనలు
చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్తతలతో కలవరం

బీజింగ్‌: చైనా కుబేరుల్లో కొత్త భయాలు నెలకొన్నాయి. అక్కడే ఉంటే తమ సంపదకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందన్న భయంతో పన్ను రాయితీలకు స్వర్గధామమైన సింగపూర్‌కు మకాం మార్చేస్తున్నారు. అక్కడ కుటుంబ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. జాక్‌మా.. అలీబాబా గ్రూప్‌ అధినేత. చైనా కుబేరుల్లో ఒకరు. చైనా కమ్యూనిస్టు ప్రభుత్వంపై మాట తూలినందుకు  అక్కడి ప్రభుత్వం కక్షగట్టి ఆయన వ్యాపారాలపై ఉక్కుపాదం మోపింది. దీంతో భారీగా సంపదను కోల్పోవడమే కాదు.. పరాయి దేశమైన జపాన్‌లో తల దాచుకోవాల్సి వస్తోంది. భవిష్యత్తులో ఇదే పరిస్థితి తమకు ఎందుకు రాదనే అనుమానం చైనాలోని కుబేరుల్లో మొదలైంది. చైనా, అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు సైతం వీరిని కలవరపెడుతున్నాయని పలువురు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు.

* సింగపూర్‌లో గత ఆరు దశాబ్దాలుగా ఒకే ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ కార్మిక సమ్మెలు, వీధుల్లో ఆందోళనలు నిషేధం. పన్నుల శాతం కూడా చాలా తక్కువ. దీనికితోడు సింగపూర్‌లో చైనావాసులే ఎక్కువగా నివసిస్తుండటం కలిసొచ్చే అంశం. దీంతో ఎక్కువమంది సంపన్నులు సింగపూర్‌ను గమ్యస్థానంగా మార్చుకొంటున్నారు. తమ దేశంలో వీరు ఖరీదైన గృహాల్లో నివసిస్తూ, ఖరీదైన కార్లలో తిరుగుతూ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని సింగపూర్‌లోని కొందరు వ్యాపారులు చెబుతున్నారు.

* చైనాకు చెందిన అతిపెద్ద హాట్‌పాట్‌ ‘హైదిలావ్‌’ (ఆహారానికి సంబంధించిన) వ్యవస్థాపకుల్లో ఒకరు ఇటీవలే సింగపూర్‌లో కుటుంబ కార్యాలయాన్ని తెరిచారు. సాధారణంగా రూ.కోట్ల  వ్యాపారాలు చేసే సంపన్నులు తమ కోసం ఏర్పాటు చేసుకునే ప్రైవేట్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలనే కుటుంబ కార్యాలయాలుగా పేర్కొంటారు. ఆ కుటుంబానికి దేశ, విదేశాల్లో ఉన్న పెట్టుబడులను ఈ కార్యాలయం పర్యవేక్షిస్తుంది. కుటుంబ సంపదను మరింత పెంచి తర్వాతి తరాలకు అందించటం వీటి అసలు లక్ష్యం. 2020లో సింగపూర్‌లో 400 కుటుంబ కార్యాలయాలు ఉండగా.. 2021 నాటికి ఆ సంఖ్య 700కు చేరింది. త్వరలోనే ఈ సంఖ్య 1500కు చేరబోతోందని సింగపూర్‌లోని ఓ ప్రైవేట్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కో-హెడ్‌ అంచనా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు