చైనా ‘నిఘా’ బెలూన్‌ కూల్చివేత

అసలే అంతంతమాత్రంగా ఉన్న అమెరికా-చైనా సంబంధాల్లో ఇదో కుదుపు! ఇరు దేశాల మధ్య కొద్దిరోజులుగా నడుస్తున్న బెలూన్‌ చిచ్చు తాజాగా పతాక స్థాయికి చేరింది. క్షిపణి స్థావరాలపై గూఢచర్యం కోసమే.

Published : 06 Feb 2023 06:02 IST

క్షిపణితో ధ్వంసం చేసిన అమెరికా
సాగర జలాల్లో పడ్డ శకలాలు
వెలికితీసి విశ్లేషిస్తామన్న పెంటగాన్‌
ప్రతిచర్య తప్పదన్న డ్రాగన్‌

వాషింగ్టన్‌: అసలే అంతంతమాత్రంగా ఉన్న అమెరికా-చైనా సంబంధాల్లో ఇదో కుదుపు! ఇరు దేశాల మధ్య కొద్దిరోజులుగా నడుస్తున్న బెలూన్‌ చిచ్చు తాజాగా పతాక స్థాయికి చేరింది. క్షిపణి స్థావరాలపై గూఢచర్యం కోసమే ఆ ‘ఎయిర్‌షిప్‌’ను తమ దేశంపైకి చైనా ప్రయోగించిందని ఆరోపించిన అగ్రరాజ్యం.. దాన్ని కూల్చేసింది. దీనిపై చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వాతావరణ పరిశోధనలకు ఉద్దేశించిన బెలూన్‌ను ధ్వంసం చేయడం ద్వారా అమెరికా అతి చేసిందని విమర్శించింది. దీనిపై తగిన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించింది.

మూడు బస్సుల పరిమాణంలో ఉన్న ఈ భారీ బెలూన్‌ కొద్దిరోజులుగా అమెరికా రక్షణ శాఖ నిఘా నేత్రంలో ఉంది. అది జనవరి 28న అలాస్కాలోని అలూషన్‌ దీవులకు ఉత్తరాన అమెరికా గగనతల రక్షణ జోన్‌లోకి ప్రవేశించింది. 30న కెనడాలోకి వెళ్లింది. ఆ మరుసటి రోజున ఉత్తర ఐదాహో ప్రాంతంలో తిరిగి అమెరికా గగనతలంలోకి ప్రవేశించింది. ఇది సున్నితమైన సైనిక స్థావరాలు, అణు క్షిపణులను భద్రపర్చిన మోంటానాపై సంచరించినట్లు వార్తలు రావడం కలకలం సృష్టించింది. అయితే కీలకమైన విషయాలు ఆ బెలూన్‌లోని పరికరాల కంటపడకుండా అదనపు జాగ్రత్తలు తీసుకున్నట్లు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం ‘పెంటగాన్‌’ తెలిపింది. ఈ బెలూన్‌ను గూఢచర్యం కోసం చైనా పంపిందని ఆరోపించింది. దీన్ని డ్రాగన్‌ ఖండించింది. అది వాతావరణ పరిశోధనలకు ఉద్దేశించిన బెలూన్‌ అని, గాలుల ప్రభావం వల్ల దారి తప్పి, అమెరికాకు వెళ్లిందని వాదించింది. ఈ ఘటనతో రెండు దేశాల మధ్య ఒక్కసారిగా వేడి పెరిగింది. బీజింగ్‌లో చేపట్టాల్సిన తన పర్యటనను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ రద్దు చేసుకున్నారు.

ఫ్లయింగ్‌ సాసర్‌గా అపోహ

ఈలోగా అమెరికాలోని పలు ప్రాంతాల్లో ప్రజలకూ ఈ బెలూన్‌ కంటపడింది. కొందరు దాన్ని గ్రహాంతర జీవుల ‘ఫ్లయింగ్‌ సాసర్‌’గా అపోహపడ్డారు. దేశంలో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తుపాకులతో ఈ బెలూన్‌ కూల్చివేతకు ప్రయత్నించొద్దని, ఆ తూటాలు అంత ఎత్తుకు చేరుకోలేవని దక్షిణ కరోలినాలోని యార్క్‌ కౌంటీలో అధికారులు ప్రకటనలు కూడా విడుదల చేయడం గమనార్హం.

కూల్చివేతకు ఒత్తిడి

ఈ బెలూన్‌ కంటపడినప్పటి నుంచి దాన్ని కూల్చివేయాలని వివిధ వర్గాల నుంచి ఒత్తిడి పెరిగింది. అయితే దాని శకలాలు జనావాసాలపై పడే ప్రమాదం ఉన్నందువల్ల అమెరికా అధికారులు సంయమనం పాటించారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా దాన్ని ధ్వంసం చేయాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఆదేశించారు. అధికారుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. శనివారం ఆ బెలూన్‌.. దక్షిణ కరోలినాలో నేల భాగాన్ని దాటి, అట్లాంటిక్‌ మహాసముద్రంపైకి చేరింది. దీంతో దాని కూల్చేవేతకు అధికారులు పూనుకున్నారు.

పనిపట్టింది ఇలా..  

పెంటగాన్‌ నుంచి ఆదేశాలు అందగానే.. వర్జీనియాలోని ల్యాంగ్లీ వైమానిక స్థావరం నుంచి ఎఫ్‌-22 స్టెల్త్‌ యుద్ధవిమానాలు నింగిలోకి దూసుకెళ్లాయి. ఇందులో ఒకటి.. 9ఎక్స్‌ సైడ్‌వైండర్‌ క్షిపణిని ప్రయోగించి బెలూన్‌ను కూల్చేసింది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 2.39 గంటలకు.. తీరానికి ఆరు నాటికల్‌ మైళ్ల దూరంలో అట్లాంటిక్‌ సముద్రంపై ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ బెలూన్‌ శకలాలు మర్టల్‌ బీచ్‌ సమీపంలో దాదాపు పది కిలోమీటర్ల విస్తీర్ణంలో పడ్డాయి. వాటిని సేకరించే పనిలో అమెరికా సైన్యం నిమగ్నమైంది. భారీ క్రేన్‌తో కూడిన యుద్ధనౌకలు ఆ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నాయి. ఈ శకలాల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని, బెలూన్‌లోని పరికరాలను సేకరించి విశ్లేషిస్తామని అధికారులు తెలిపారు.  

ఐదు ఖండాల్లో..

చైనా వద్ద ఇలాంటి నిఘా బెలూన్లు అనేకం ఉన్నాయని అమెరికా రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఇటీవల వెనెజువెలా, కొలంబియాల్లోనూ అవి ఎగురుతూ కనిపించాయని పేర్కొన్నారు. గత కొన్నేళ్లలో అవి తూర్పు ఆసియా, దక్షిణాసియా, ఐరోపాల్లో వెలుగు చూశాయన్నారు. మొత్తంమీద ఐదు ఖండాల్లో వీటి కదలికలను గుర్తించినట్లు తెలిపారు.

తమ బెలూన్‌ కూల్చివేతపై చైనా విదేశాంగశాఖ ఓ ప్రకటన వెలువరించింది. అమెరికా చెబుతున్నట్లు అది సైనిక ఎయిర్‌షిప్‌ కాదని పేర్కొంది. వాతావరణ పరిశోధనలకు ఉద్దేశించిన పౌర బెలూన్‌ అని తెలిపింది. నిరాయుధ ఎయిర్‌షిప్‌పై దాడి చేయడం అంతర్జాతీయ కట్టుబాట్లను ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఆ బెలూన్‌ను ప్రయోగించిన కంపెనీ చట్టబద్ధ హక్కులు, ప్రయోజనాలను పరిరక్షిస్తామని స్పష్టం చేసింది.


బెలూన్‌ గురించి సమాచారం తెలియగానే వీలైనంత త్వరగా దానిని కూల్చివేయాలని ఆదేశించా. అమెరికా ప్రాదేశిక జలాల పరిధిలోనే దాన్ని ధ్వంసం చేయాలని అధికారులు నిర్ణయించారు. దాన్ని విజయవంతంగా అమలు చేశారు. మా వైమానిక సిబ్బందిని అభినందిస్తున్నా.

బైడెన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని