Earthquake: ఈ దేశాల్లో నిత్యం భూప్రళయాలే

భూకంపాలు రావడానికి కారణం భూ ఫలకాల కదలికలే. కొన్ని చోట్ల వీటి కదలికలు భారీ భూకంపాలు రావడానికి కారణమవుతుంటాయి.

Updated : 07 Feb 2023 07:59 IST

భూకంపాలు రావడానికి కారణం భూ ఫలకాల కదలికలే. కొన్ని చోట్ల వీటి కదలికలు భారీ భూకంపాలు రావడానికి కారణమవుతుంటాయి. అలాంటి సున్నిత ప్రాంతాల్లో ఉన్న దేశాల్లో సంవత్సరానికి కొన్ని వందల భూకంపాలు వస్తున్నప్పటికీ.. వాటి తీవ్రత తక్కువ కావడంతో పెద్దగా నష్టం వాటిల్లదు. అలా భూప్రకంపనలు చోటుచేసుకునే తొలి ఐదు దేశాలు ఇవే..

జపాన్‌..  భూకంపాలు, సునామీ అనగానే గుర్తొచ్చే దేశం జపాన్‌. భూకంపాలు రావడానికి ఎక్కువ అవకాశమున్న ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ ప్రాంతంలో ఈ దేశ భూభాగం ఎక్కువగా ఉండటమే ఇక్కడి విపత్తులకు ప్రధాన కారణం. గుర్రపు నాడ ఆకారంలో ఉండే ఈ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ ప్రాదేశిక స్థలంలో 40 వేల కి.మీ. మేర చలనశీల టెక్టానిక్‌ ప్లేట్‌లు ఉండటం విశేషం. అయితే భూకంపం, సునామీలు ముంచుకొచ్చినపుడు ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ఈ దేశం అనేక చర్యలు తీసుకుంటోంది. ఏటా సెప్టెంబరు 1న విపత్తు నివారణ దినం పేరుతో పలు విన్యాసాలు చేపడుతోంది.

ఫిలిప్పీన్స్‌..  రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌కు సరిహద్దుల్లోనే ఉన్నప్పటికీ ఫిలిప్పీన్స్‌లోనూ భూకంపాల ప్రమాదం ఎక్కువే. అంతేకాకుండా భూకంపాల వల్ల ఇక్కడి అగ్నిపర్వతాలు పేలిన ఘటనలూ ఈ దేశ చరిత్రలో ఉన్నాయి. విపత్తును ఎదుర్కోవడానికి ఫిలిప్పీన్స్‌ పలు విధానాలను అమలుచేస్తోంది.

ఇండోనేసియా..  ప్రపంచంలో వచ్చే భూకంపాల్లో 90 శాతం పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌లోనే నమోదవుతాయని అంచనా. అలాంటి ప్రాంతంలో అత్యంత సున్నితమైన ప్రదేశంలో ఇండోనేసియా ఉంటుంది. చిన్న, మధ్య స్థాయి భూకంపాలు ఇక్కడ సర్వసాధారణం.

ఈక్వెడార్‌.. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఉన్న అగ్ని పర్వతాల వల్ల ఈక్వెడార్‌లో భూకంపాలు, భూప్రకంపనల ప్రమాదం చాలా ఎక్కువ. దక్షిణ అమెరికా, నాజ్కా భూఫలకాల మధ్య ఘర్షణ మరో ప్రధాన కారణం.
తుర్కియే.. ప్రస్తుతం వరస భూప్రకంపనలతో అల్లాడుతున్న తుర్కియే.. యురేషియా, ఆఫ్రికా, అరేబియా అనే మూడు భూఫలకాలపై ఉంది. అనేక భూ పటల (ఎర్త్‌ క్రస్ట్‌) చీలికలపై ఈ దేశ భూభాగం ఉండటంతో భూకంపాలు రావడానికి ఎక్కువ ఆస్కారముంది. ఒక్క 2021లోనే ఈ దేశంలో 23,735 భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ప్రఖ్యాత పర్యాటక స్థలం ఇస్తాంబుల్‌ నగరాన్ని భూకంపాల నుంచి కాపాడటానికి అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తుర్కియే గతంలో ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు