రేసర్‌లా బైక్‌లు, కార్లు నడుపుతున్న మూడేళ్ల చిన్నోడు

మూడేళ్ల చిన్నోడు బైక్‌లు, సూపర్‌ కార్లను నడిపేస్తున్నాడు. యాక్సిలరేటర్‌ అందకపోయినా.. ముందు ఏముందో సరిగ్గా కనపడకపోయినా రేసర్‌లా దూసుకుపోతున్నాడు.

Updated : 19 Feb 2023 07:24 IST

మూడేళ్ల చిన్నోడు బైక్‌లు, సూపర్‌ కార్లను నడిపేస్తున్నాడు. యాక్సిలరేటర్‌ అందకపోయినా.. ముందు ఏముందో సరిగ్గా కనపడకపోయినా రేసర్‌లా దూసుకుపోతున్నాడు. తుర్కియేకు చెందిన కెనాన్‌ సోఫౌగ్లు ఓ మోటార్‌ సైకిల్‌ రేసర్‌. అతడి చిన్న కుమారుడే ఈ పిల్లాడు. అతడి పేరు జైన్‌ సోఫౌగ్లు. జైన్‌ చిన్ననాటి నుంచి మోటార్‌ సైకిళ్లు, సూపర్‌ కార్లతోనే ఎక్కువగా గడిపేవాడు. ఇంకా చెప్పాలంటే ఈ బాలుడు కొందరు పెద్దవాళ్లకంటే కూడా అద్భుతంగా కార్లను నడపగలడు. జైన్‌ సోఫౌగ్లుకు ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 10లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. మూడేళ్ల పిల్లాడు కలలో కూడా ఊహించని అనేక విన్యాసాలను చేస్తున్నాడు. ఎంతో ఇరుకైన ఓ గ్యారేజీలో కారును అద్భుతంగా పార్క్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇటీవలే అతడి తల్లిదండ్రులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. సాధారణ కార్లే కాకుండా సూపర్‌ కార్లను సైతం అద్భుతంగా నడుపుతాడు జైన్‌. ముందు వెళ్లే వాహనాలు కనపడేలా కారులో ఓ ట్యాబ్‌ను ఏర్పాటు చేశారు అతడి తల్లిదండ్రులు. కారు ముందున్న దృశ్యాలను ఆ ట్యాబ్‌లో చూస్తూ.. కాళ్లు అందకున్నా పెడల్‌ కోసం కష్టపడుతూనే సూపర్‌గా డ్రైవ్‌ చేస్తున్నాడు జైన్‌. తుర్కియే పార్లమెంట్‌ సభ్యుడైన జైన్‌ తండ్రి కెనాన్‌.. చట్టబద్ధమైన వయసు లేకుండా కుమారుడితో కారు నడిపిస్తున్నారని తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని