మగ + మగ = సంతానం.. ఎలుకల్లో జపాన్ శాస్త్రవేత్తల అరుదైన సృష్టి

మానవుల్లో ప్రత్యుత్పత్తి ప్రక్రియను కొత్త పుంతలు తొక్కించే దిశగా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. తొలిసారిగా రెండూ మగ ఎలుకలనే ఉపయోగించి సంతానాన్ని ఉత్పత్తి చేశారు.

Updated : 10 Mar 2023 09:20 IST

పదేళ్లలో మానవులపైనా ప్రయోగాలు

టోక్యో: మానవుల్లో ప్రత్యుత్పత్తి ప్రక్రియను కొత్త పుంతలు తొక్కించే దిశగా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. తొలిసారిగా రెండూ మగ ఎలుకలనే ఉపయోగించి సంతానాన్ని ఉత్పత్తి చేశారు. భవిష్యత్తులో ఇద్దరు పురుషులు కలిసి పిల్లల్ని పొందేందుకు ఈ విధానం దోహదపడే అవకాశాలున్నాయి. తాజా పరిశోధనలో భాగంగా జపాన్‌లోని క్యుషు, ఒసాకా విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు తొలుత మగ ఎలుక చర్మ కణాలను తీసుకున్నారు. ఇండ్యూస్డ్‌ ప్లూరీపొటెంట్‌ స్టెమ్‌ (ఐపీఎస్‌) కణాలను సృష్టించేందుకు ఆ చర్మకణాలను మూలకణాల స్థితికి చేర్చారు.

తర్వాత- వాటి నుంచి ‘వై’ క్రోమోజోంను తొలగించారు. ఆ స్థానంలో మరో ‘ఎక్స్‌’ క్రోమోజోంను ప్రవేశపెట్టారు. ఆ కణాలు అండాలుగా తయారయ్యేలా చేశారు. అనంతరం ఈ అండాలను మరో ఎలుక వీర్యంతో ఫలదీకరణం చెందించారు. ఈ విధానంలో మొత్తం 600 పిండాలు ఏర్పడ్డాయి. వాటిని సరోగేట్‌ ఎలుకలో ప్రవేశపెట్టగా.. అది ఏడు ఎలుక పిల్లలకు జన్మనిచ్చింది. అవి ఆరోగ్యంగా ఉన్నాయి. ఈ ఎలుకలకు జీవశాస్త్రపరంగా రెండు తండ్రి ఎలుకలు (బయోలాజికల్‌ ఫాదర్‌) ఉన్నట్లు భావించొచ్చు. మానవ కణాలపైనా ఈ తరహా విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించడం రాబోయే పదేళ్లలో సాధ్యం కావొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని