భారత్‌, అమెరికాలది అసమాన స్నేహం

ప్రస్తుత భౌగోళిక, రాజకీయ పరిస్థితులనుబట్టి చూస్తే భారత్‌, అమెరికాల స్నేహం ప్రపంచంలోనే అసమానమని భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టీ పేర్కొన్నారు.

Published : 31 May 2023 04:03 IST

అమెరికా రాయబారి గార్సెట్టీ

దిల్లీ: ప్రస్తుత భౌగోళిక, రాజకీయ పరిస్థితులనుబట్టి చూస్తే భారత్‌, అమెరికాల స్నేహం ప్రపంచంలోనే అసమానమని భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టీ పేర్కొన్నారు. జూన్‌లో అమెరికాలో ప్రధాని మోదీ పర్యటించనున్న సందర్భంగా రెండు దేశాల వ్యూహాత్మక బంధం మరింత విస్తృతం కానుందని తెలిపారు. మంగళవారం దిల్లీలో గార్సెట్టీ ఓ వార్తాసంస్థతో మాట్లాడారు. ‘రక్షణ రంగంలో మరింత సహకారం కోసం కుదుర్చుకునే ఒప్పందాలపై రెండు దేశాలు పని చేస్తున్నాయి. అవి మోదీ జూన్‌లో అమెరికాకు, బైడెన్‌ సెప్టెంబరులో భారత్‌కు వచ్చినప్పుడు కార్యరూపం దాల్చనున్నాయి. చైనాతో సరిహద్దు వివాదం విషయంలో భారత్‌కు అమెరికా నమ్మకమైన భాగస్వామే. సరిహద్దులను గౌరవించడంతో సార్వభౌమాధికారం, చట్టాల విషయంలో అమెరికా ఎప్పుడూ రక్షణగానే నిలుస్తుంది. భారత్‌, అమెరికాలకు చైనాతో శాంతియుత సంబంధాలే కొనసాగాలని కోరుకుంటాం. అయితే ఎవరు రెచ్చగొట్టేలా వ్యవహరించినా అంగీకరించం. తీవ్రవాదం, డ్రగ్స్‌, అంతర్జాతీయ నేర నెట్‌వర్క్‌లపై కలిసే పని చేస్తాం. సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటాం. భారత్‌, అమెరికాల భౌగోళిక, రాజకీయ బంధం రెండు దేశాలకే కాదు. ప్రపంచానికే ప్రయోజనకరం. భారత్‌కు ఆయుధ వ్యవస్థలకు సంబంధించిన టెక్నాలజీని బదిలీ చేసి స్థానికంగా తయారు చేసుకునే అవకాశమిస్తున్నాం. ఇలాంటి అవకాశం మా సన్నిహిత దేశాలకూ ఇవ్వడం లేదు. దీనిని బట్టి భారత్‌, అమెరికా బంధం ఎంత ముఖ్యమైందో అర్థం చేసుకోవచ్చు. వచ్చే నెలలో మోదీ పర్యటన సందర్భంగా రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, వాతావరణ మార్పులు, ప్రజల మధ్య సంబంధాలపై మరింతగా చర్చలు జరగనున్నాయి. మోదీ పర్యటన కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం’ అని గార్సెట్టీ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని