భారీగా కర్బన గరళాన్ని ఒడిసిపట్టే శిలీంద్రాలు

నేలలో దాగిన శిలీంద్రాలు ఏకంగా 13 గిగాటన్నుల కార్బన్‌ను నిల్వ చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు.

Published : 10 Jun 2023 03:33 IST

‘నెట్‌జీరో’ సాధనలో కీలకం

లండన్‌: నేలలో దాగిన శిలీంద్రాలు ఏకంగా 13 గిగాటన్నుల కార్బన్‌ను నిల్వ చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. ఇది ఏటా ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాలను మండించడం వల్ల వెలువడే ఉద్గారాల్లో 36 శాతమని వెల్లడించారు. నెట్‌జీరో సాధనకు ఈ వివరాలు కీలకం కావొచ్చని వివరించారు. బ్రిటన్‌లోని షెఫీల్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. మైకోరిజాల్‌ ఫంగై.. దాదాపు 45 కోట్ల ఏళ్లుగా పుడమిపై జీవుల మనుగడకు దోహదపడుతున్నాయి. ఇవి నేలలో భారీ సమూహాలుగా జీవిస్తుంటాయి. ఇవి మొక్కలతో కలిసి సాగుతూ కర్బనాన్ని నిల్వ చేస్తుంటాయి. అలాగే చక్కెర, కొవ్వు రూపంలో నేలలోకి కర్బనాన్ని రవాణా చేస్తుంటాయి. ఈ రూపంలో ఈ శిలీంద్రాలు ఎంత పరిమాణంలో కార్బన్‌ను నిల్వ చేస్తాయన్నది ఇప్పటివరకూ అస్పష్టంగానే ఉంది. అయితే మొక్కల నుంచి శిలీంద్రాల్లోకి ఏటా 13.12 గిగాటన్నుల కార్బన్‌ డైఆక్సైడ్‌ బదిలీ అవుతున్నట్లు శాస్త్రవేత్తలు వారు గుర్తించారు. మొక్కలు-నేల ప్రక్రియలపై వెలువడిన వందల అధ్యయనాలను విశ్లేషించడం ద్వారా వారు ఈ నిర్ధారణకు వచ్చారు. ఈ లెక్కన నేల ఒక భారీ కర్బన నిల్వ కేంద్రమని స్పష్టమవుతున్నట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని