World War III: జర్మనీ గుండెల్లో ‘మూడో ప్రపంచ యుద్ధ’ భయం!

రానున్న రోజుల్లో ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం (Ukraine Russia conflict) మరింత విస్తరించి.. మూడో ప్రపంచ యుద్ధానికి (World War III) దారితీస్తుందేమోనన్న భయం జర్మనీకి పట్టుకుందని తాజా నివేదిక వెల్లడించింది.

Updated : 16 Jan 2024 17:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర (Russia Invasion) మొదలుపెట్టి రెండేళ్లవుతోంది. పుతిన్‌ సేనలు భీకర దాడులకు తెగబడుతున్నా.. ఉక్రెయిన్‌ సైన్యం వాటిని దీటుగా ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే  ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. రానున్న రోజుల్లో ఈ యుద్ధం (Ukraine Crisis) మరింత విస్తరించి.. మూడో ప్రపంచ యుద్ధానికి (World War III) దారితీస్తుందనే భయం జర్మనీకి పట్టుకుందని తాజా నివేదిక వెల్లడించింది. దీంతో రష్యాతో సాయుధ పోరాటానికి జర్మనీ కూడా సిద్ధమవుతోందని తెలిపింది. ఇందుకు సంబంధించి జర్మనీ రక్షణశాఖకు చెందిన రహస్య పత్రాల నుంచి సేకరించిన కీలక సమాచారాన్ని స్థానిక వార్తాపత్రిక (Bild) వెల్లడించింది.

ఉక్రెయిన్‌కు తగ్గుతోన్న సాయం..

యుద్ధం మొదలైనప్పటినుంచి ఉక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాలు తోడుగా నిలుస్తున్నా ఇటీవల వాటి నుంచి వచ్చే నిధులు తగ్గుతున్నాయి. ఇదే అదనుగా భావిస్తోన్న రష్యా (Russia), ఉక్రెయిన్‌ సేనలపై మరింత విరుచుకుపడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నాటో (NATO) సభ్య దేశాలు పోరుకు సిద్ధంగా లేవని భావించిన వెంటనే.. పుతిన్‌ (Vladimir Putin) ఈ దాడులకు ఉపక్రమించే అవకాశం ఉందట. ఈ పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధం (World War III) ప్రారంభానికి దారితీయొచ్చని తాజా కథనం పేర్కొంది.

యుద్ధం విస్తరణకు రష్యా ప్రయత్నాలు..

ఐరోపా తూర్పు భాగంలో దాదాపు 2లక్షల మంది సైన్యంతో రష్యా భూతల, సైబర్‌ దాడులు చేయవచ్చని నాటో దేశాలు భావిస్తున్నాయి. సెప్టెంబర్‌ నాటికి ఈ ఘర్షణలు తీవ్రస్థాయికి చేరుకుంటాయని.. అప్పుడు రష్యా భారీ స్థాయిలో సైన్యం, క్షిపణులతో దాడులకు దిగవచ్చని అంచనా. ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలను రష్యా అవకాశంగా మలచుకొని, మరింత హింసకు ఆజ్యం పోస్తుందని తాజా కథనం పేర్కొంది. రష్యా నుంచి పొంచివున్న ముప్పును ఐరోపా దేశాలు తీవ్రంగా పరిగణించకుంటే, వచ్చే ఏడాదిన్నరలోనే మూడో ప్రపంచ యుద్ధం మొదలయ్యే ప్రమాదం ఉందని అమెరికా సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు కూడా హెచ్చరిస్తున్నారు.

సిద్ధమవుతోన్న జర్మనీ..

ఇలా భిన్న భయాలు నెలకొన్న వేళ.. రష్యాతో సాయుధ పోరాటానికి జర్మనీ సిద్ధమవుతున్నట్లు తాజా కథనం పేర్కొంది. మరికొన్ని వారాల్లోనే ఆ ప్రాంతంలో వేల మంది సైన్యాన్ని మోహరించే అవకాశం ఉందని తెలిపింది. దీనికి సంబంధించి జర్మనీ రక్షణశాఖకు చెందిన పలు కీలక పత్రాల నుంచి సమాచారాన్ని గ్రహించింది. మరోవైపు, యుద్ధం విస్తరణపై వినిపిస్తోన్న వాదనలను రష్యా ఖండిస్తోంది. అయినా రష్యా నుంచి పొంచివున్న ముప్పును తీవ్రంగా పరిగణిస్తోన్న ఐరోపా మిత్ర దేశాలు, వాటిని ఎదుర్కొనేందుకు ఉన్న అన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని