Ukraine Crisis: ఎఫ్‌-35 విమానాలు కొనుగోలు చేయనున్న జర్మనీ..

ఉక్రెయిన్‌పై రష్యా దళాలు దాడులు తీవ్రం చేయడంతో జర్మనీ అప్రమత్తమైంది. తన రక్షణ వ్యయాలను పెంచుతున్నట్లు ఇటీవల ప్రకటించింది.

Published : 16 Mar 2022 23:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌పై రష్యా దళాలు దాడులు తీవ్రం చేయడంతో జర్మనీ అప్రమత్తమైంది. తన రక్షణ వ్యయాలను పెంచుతున్నట్లు ఇటీవల ప్రకటించింది. తాజాగా అమెరికా తయారీ ఎఫ్‌-35 స్టెల్త్‌ జెట్‌లను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 35 విమానాలను కొనుగోలు చేయనుంది. జర్మనీ ఛాన్సలర్‌గా ఓలాఫ్‌ షోల్జ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రకటించిన తొలి డిఫెన్స్‌ డీల్‌ ఇదే.

ఐరోపా సమాఖ్య రక్షణ జాగ్రత్తలు పెంచాలన్న డిమాండ్‌ వస్తోన్న సమయంలో జర్మనీ నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. మరోపక్క రష్యాతో ఆర్థిక సంబంధాలను కుదించుకొంటూ జర్మనీ కఠిన చర్యలు చేపట్టింది. ఇప్పటికే జర్మనీ వద్ద ఉన్న పాత టోర్నిడో విమానాలను సరికొత్త ఎఫ్‌-35లు భర్తీ చేయనున్నాయి. ఐరోపాలో యుద్ధం వస్తే దాడి చేయడానికి వీలుగా అమెరికా ప్రభుత్వం జర్మనీలో కొన్ని అణ్వాయుధాలను దాచింది. వీటిని ప్రయోగించగల ఏకైక విమానాలు ఇప్పటి వరకు టోర్నిడోలే. తాజాగా ఎఫ్‌-35లు వస్తే అదనపు బలం చేకూరినట్లే. 2023 నాటికి యూరప్‌లోని ఎఫ్‌-35లు అణ్వాయుధాలు ప్రయోగించేలా సిద్ధం చేస్తామని అమెరికా రక్షణశాఖ ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని