Earthquake: సన్నగిల్లిన ఆశలు.. 21వేలు దాటిన మరణాలు

తుర్కియే (Turkey), సిరియా (Syria)లో భూకంపం (Earthquake) సృష్టించిన ఘోర విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సమయం గడుస్తున్న కొద్దీ శిథిలాల కింద మృత్యుంజయులు కన్పిస్తారనే ఆశలు సన్నగిల్లుతున్నాయి.

Updated : 10 Feb 2023 11:47 IST

అంకారా: ప్రకృతి విలయంతో కకావికలమైన తుర్కియే (Turkey), సిరియా (Syria)లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే విపరీతంగా కురుస్తున్న మంచు, వరుసగా వస్తున్న ప్రకంపనలు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. మరోవైపు భూకంప సహాయక చర్యల్లో అత్యంత కీలకమైన 72 గంటలు కూడా ముగియడంతో.. శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడుతారన్న ఆశలు క్షణక్షణానికి సన్నగిల్లుతున్నాయి.

వందల కొద్దీ బయటపడుతున్న శవాలు..

మరోవైపు ఈ భూప్రళయం (Earthquake)లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉండటం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ పెద్ద సంఖ్యలో మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే మృతుల సంఖ్య 21వేలు దాటింది. ఒక్క తుర్కియే (Turkey)లోనే 17,674 మంది ప్రకృతి ప్రకోపానికి బలవ్వగా.. సిరియాలో 3,377 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 21,051కి పెరిగింది. శిథిలాల కింద ఎంతమంది ఉన్నారన్నదానిపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. అయితే, సమయం గడుస్తున్న కొద్దీ వారు సజీవంగా ఉండే అవకాశాలు తగ్గుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు సహాయక బలగాలు కాలంతో పోటీపడి గాలింపు చర్యలు చేపడుతున్నారు.

బతికించిన వాట్సప్..

శిథిలాల కింద చిక్కుకున్న ఓ 20 ఏళ్ల విద్యార్థిని వాట్సప్‌ కాపాడింది. తూర్పు తుర్కియే (Turkey)లోని ఓ అపార్ట్‌మెంట్ భవన శిథిలాల కింద చిక్కుకున్న ఆ విద్యార్థి.. సమయస్ఫూర్తితో ఆలోచించి సోషల్‌మీడియా ద్వారా తన స్నేహితులకు వీడియో సందేశం పంపాడు. అందులో తాను ఏ ప్రాంతంలో ఉన్నది చెప్పాడు. వాట్సప్‌ స్టేటస్‌ షేర్‌ చేయడంతో అతడి స్నేహితులు సహాయక సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు వెంటనే అక్కడి శిథిలాలను తొలగించి ఆ విద్యార్థితో పాటు అతడిని కాపాడారు. అయితే అతడి బంధువులు మాత్రం ఇంకా శిథిలాల కిందే ఉన్నట్లు ఆ విద్యార్థి తెలిపాడు.

సిరియా బయల్దేరిన డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌

ఈ విపత్తుతో అల్లకల్లోలమైన తుర్కియే, సిరియాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అండగా నిలిచింది. డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధానమ్‌ సిరియా (Syria)కు బయల్దేరారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించనున్నారు. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ దేశాలకు ఆర్థిక సాయం ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని