Imran Khan: నన్ను కోర్టులోనే చంపేస్తారేమో: ఇమ్రాన్‌ ఖాన్‌

దాదాపు 100 కేసుల్లో నిందితుడిగా ఉన్న పాక్‌ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan)ను అరెస్టు చేసేందుకు పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారు. అయితే తనను చంపేసేందుకే పోలీసులు ఈ అరెస్టు కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

Updated : 21 Mar 2023 13:11 IST

లాహోర్‌: తనను హత్య చేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న పాకిస్థాన్‌ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan).. మరోసారి అదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. కోర్టులోనే తనను చంపేసే అవకాశముందని, అందువల్ల విచారణకు వర్చువల్‌గా హాజరయ్యేందుకు అనుమతివ్వాలని కోరారు. ఈ మేరకు పాక్‌ (Pakistan) ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అట్టా బాందియల్‌కు ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan) లేఖ రాశారు.

‘‘తోషాఖానా అవినీతి కేసులో విచారణకు హాజరయ్యేందుకు గత శనివారం నేను ఇస్లామాబాద్‌ (Islamabad)లోని ఫెడరల్‌ జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ కోర్టుకు వెళ్లాను. అక్కడ నన్ను చంపేందుకు విఫలయత్నం జరిగింది. దాదాపు 20 మంది గుర్తుతెలియని వ్యక్తులు కోర్టు ప్రాంగణంలో నన్ను చంపేందుకు వేచి ఉన్నారు. సాధారణ దుస్తుల్లో ప్లాస్టిక్‌ సంకెళ్లు పట్టుకుని కన్పించారు. వారంతా నన్ను పట్టుకుని చంపేయాలని భావించారు. అయితే అదృష్టవశాత్తూ అది జరగలేదు. అత్యంత భద్రత కలిగిన జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌లోకి ఆ గుర్తుతెలియని వ్యక్తులు ఎలా వచ్చారో దర్యాప్తు జరిపించాలి. ఇలాంటి వాటిని నేను బయటపెడుతుంటే.. నన్ను చంపేసేందుకు వారికి ఎక్కువ సమయం పట్టదు. కోర్టుకు వస్తే అక్కడే హత్య చేస్తారేమో. అందువల్ల విచారణలకు వర్చువల్‌గా హాజరయ్యేందుకు అనుమతినివ్వాలని కోరుతున్నా’’ అని ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan) ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేగాక, తనపై నమోదైన కేసులన్నింటినీ కలిపి ఒకేసారి విచారించాలని ఆయన చీఫ్‌ జస్టిస్‌ను అభ్యర్థించారు.

ఉగ్రవాదం, హత్యలు, దోపిడీ వంటి అభియోగాలపై దాదాపు 100 కేసుల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ నిందితుడిగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయనను అరెస్టు చేసేందుకు గత కొన్ని రోజులుగా పోలీసులు ప్రయత్నిస్తుండగా.. హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గత శనివారం ఆయన కోర్టుకు హాజరైన సమయంలో లాహోర్‌లోని ఆయన ఇంటి పైకి వేలాది మంది పోలీసులు వెళ్లి అనేక మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. అదే సమయంలో ఇస్లామాబాద్‌లోని కోర్టు ప్రాంగణంలోనూ ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ పీటీఐ (PTI) కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాటలు జరిగాయి. ఈ ఘర్షణల్లో పలువురు పోలీసులు, పీటీఐ కార్యకర్తలు గాయపడ్డారు. ఈ పరిణామాల తర్వాత 300 మందికి పైగా పీటీఐ కార్యకర్తలను అరెస్టు చేసి వారిపై ఉగ్రవాద అభియోగాలు మోపారు. అటు ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీపైనా నిషేధం విధించేందుకు కసరత్తులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని