SBI - PNB results: ఎస్‌బీఐ లాభం ₹21,384 కోట్లు.. పీఎన్‌బీ లాభం మూడింతలు

ప్రభుత్వరంగ బ్యాంకులైన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI), పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (PNB) మెరుగైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి.

Published : 09 May 2024 15:48 IST

ముంబయి: ప్రభుత్వరంగ బ్యాంకులైన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI), పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (PNB) మెరుగైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో ఎస్‌బీఐ రూ.21,384 కోట్లు ఆర్జించగా.. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ లాభం మూడింతలు పెరిగింది.

2023-24 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఎస్‌బీఐ రూ.21,384.15 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.18,093.84 కోట్లతో పోలిస్తే 18.18 శాతం వృద్ధి నమోదైంది. స్టాండలోన్‌ పద్ధతిలో నికర లాభం 16,694.51 కోట్ల నుంచి రూ.20,698.35 కోట్లకు పెరిగింది. పూర్తి ఆదాయం రూ.1.06 లక్షల కోట్ల నుంచి రూ.1.28 లక్షల కోట్లకు పెరిగింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఏకీకృత ప్రాతిపదికన  నికర లాభం రూ.55,648.17 కోట్ల నుంచి రూ.67,084.67 కోట్లకు పెరిగింది. స్థూల నిరర్థక ఆస్తులు 2.78 శాతం నుంచి 2.24 శాతానికి తగ్గినట్లు బ్యాంక్‌ తెలిపింది.

పీఎన్‌బీ బంపర్ రిజల్ట్స్‌

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ మూడింతల లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు త్రైమాసికంలో రూ.1159 కోట్ల నికర లాభాన్ని ఆర్జించగా.. తాజాగా ఆ మొత్తం 3,010 కోట్లకు పెరిగింది. బ్యాంక్‌ కోర్‌ ఆదాయం పెరగడం, బ్యాడ్‌ లోన్స్ తగ్గడం లాభం పెరుగుదలకు దోహదం చేసింది. సమీక్షా త్రైమాసికంలో బ్యాంక్‌ మొత్తం ఆదాయం సైతం రూ.27,269 కోట్ల నుంచి రూ.32,361 కోట్లకు పెరిగింది. వడ్డీ ఆదాయం రూ.23,849 కోట్ల నుంచి రూ.28,113 కోట్లకు చేరింది. స్థూల నిరర్థక ఆస్తులు 8.74 శాతం నుంచి 5.73 శాతానికి తగ్గినట్లు బ్యాంక్‌ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని