Sharad Pawar: ‘ఆయన కుమారుడిని కానందువల్లే’ - శరద్‌ పవార్‌పై అజిత్‌ విమర్శ

శరద్‌ పవార్‌ (Sharad Pawar) కుమారుడిని కానందువల్లే రాజకీయ అవకాశాలు రాలేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ వ్యాఖ్యానించారు.

Published : 09 May 2024 15:39 IST

పుణె: నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎస్‌పీ) అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar)పై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కుమారుడిని కానందువల్లే తనకు రాజకీయ అవకాశాలు రాలేదన్నారు. 80 ఏళ్లు దాటిన తర్వాత కొత్తవారికి అవకాశం (పార్టీ పగ్గాలు చేపట్టే) ఇవ్వాలన్నారు. భాజపాతో కలిసి పనిచేసే విషయంపై గతంలో సంప్రదింపులు జరిపినట్లు శరద్‌ పవార్‌ అంగీకరించడం గొప్ప విషయమన్నారు. పుణెలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో బాబాయ్‌పై అజిత్‌ పవార్‌ ఈ విమర్శలు గుప్పించారు.

‘నా వయసు 60 ఏళ్లుపైనే. మనకు అవకాశం రావాలా? వద్దా? మనం ఏమైనా తప్పు చేస్తున్నామా? అందుకే ఈ భావోద్వేగం. పవార్‌ సాహెబ్‌ కూడా మనకు దైవంతో సమానం. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ, ప్రతి వ్యక్తికీ ఓ సమయం ఉంటుంది. 80 ఏళ్లు దాటిన తర్వాత కొత్తవారికి అవకాశం కల్పించాలి. పవార్‌ కుమారుడినైతే నాకు అవకాశం వచ్చేదా? అలా అయితే వచ్చి ఉండేది. ఆయన కుమారుడిని కానందువల్లే ఆ (పార్టీ పగ్గాలు చేపట్టే) అవకాశం రాలేదు. ఇదెక్కడి న్యాయం?’ అని అజిత్‌ పవార్‌ ప్రశ్నించారు. శిరూర్‌ లోక్‌సభ పరిధిలో ప్రచారం నిర్వహించిన అజిత్.. శరద్‌ పవార్‌ తీరుపై విమర్శలు చేశారు.

యోగి పర్యటనలో బుల్‌డోజర్ల బ్రేక్‌డ్యాన్స్‌..!

భాజపాతో కలిసి పనిచేయాలని శరద్‌ పవార్‌ గతంలో ప్రయత్నించడంపైనా అజిత్‌ స్పందించారు. తనతోపాటు ప్రఫుల్‌ పటేల్‌ సమక్షంలోనే భాజపా అధిష్ఠానంతో ఆరుసార్లు భేటీలు జరిగాయన్నారు. దిల్లీ నుంచి ముంబయికి తిరిగి వచ్చిన తర్వాతే పవార్‌ నిర్ణయం మార్చుకున్నారని, అనంతరం శివసేనతో కలిసి పనిచేయాలని నిర్ణయించారని అన్నారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ఉద్దేశం లేకుంటే చర్చలు ఎందుకు జరిపారని ప్రశ్నించారు.

మరోవైపు పుణె జిల్లాలోని బారామతి లోక్‌సభ స్థానం పవార్‌ కుటుంబానికి కంచుకోటగా ఉంది. మే 7న ఇక్కడ పోలింగ్‌ జరిగింది. అజిత్‌ భార్య ఇక్కడినుంచి పోటీ చేయగా.. శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియా సూలే ప్రత్యర్థిగా బరిలో నిలిచారు. ఇదిలాఉంటే, అజిత్‌, మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎన్‌సీపీని వీడి ఏక్‌నాథ్‌ శిందే వర్గంలో చేరిన విషయం తెలిసిందే. భాజపా ప్రభుత్వం ఏర్పాటుచేయగా.. అజిత్‌ ఉప ముఖ్యమంత్రి అయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని