USA: అమెరికాలో మరో ఘటన.. వీధి గొడవలో భారత సంతతి వ్యాపారవేత్త మృతి

భారత సంతతికి చెందిన ఓ వ్యాపారవేత్త అమెరికాలో జరిగిన వీధి గొడవలో మృతి చెందాడు.

Updated : 10 Feb 2024 12:56 IST

వాషింగ్టన్‌: అమెరికా (USA)లో నివసిస్తున్న భారతీయ విద్యార్థులు, భారత సంతతి (Indian Origin)కి చెందిన వారు వరుసగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. వీధి గొడవలో గుర్తు తెలియని దుండగుడి చేతిలో భారత సంతతికి చెందిన ఓ వ్యాపారవేత్త మృతి చెందారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం..

వివేక్‌ తనేజా(41).. అమెరికా ప్రభుత్వానికి సాంకేతిక సహకారం అందిస్తున్న టెక్నాలజీ సొల్యూషన్స్‌, అనలైటిక్‌ ప్రొడక్ట్‌ ప్రొవైడర్‌ ‘డైనమో టెక్నాలజీస్‌’ సహ వ్యవస్థాపకుడు. ఈయన వర్జీనియాలో నివాసముంటున్నారు. ఫిబ్రవరి 2న ఓ రెస్టరంట్‌కు వెళ్లిన ఆయన అర్థరాత్రి 2 గంటల సమయంలో బయటకు వచ్చారు. వీధిలో నుంచి నడుచుకుంటూ వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తితో గొడవ జరిగింది. అది కాస్తా తీవ్రమవడంతో.. దుండగుడు ఆయనపై దాడి చేశాడు. వివేక్‌ను విచక్షణా రహితంగా నేలకేసి కొట్టాడు. తలకు తీవ్రంగా గాయమవ్వడంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. ఆయనను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వివేక్‌ ప్రాణాలు కోల్పోయారు.

న్యూయార్క్‌ కోర్టు జడ్జిగా భారతీయుడు

వారి మధ్య గొడవ జరగడానికి గల కారణాన్ని అధికారులు వెల్లడించలేదు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడి ఫొటోను విడుదల చేసి 25 వేల డాలర్ల రివార్డును ప్రకటించారు. అతడి కోసం గాలింపులు చేపట్టారు. అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన హైదరాబాద్‌ విద్యార్థి సయ్యద్ మజాహిర్‌ అలీపై ఇటీవల గుర్తు తెలియని దుండగులు దాడికి తెగబడిన విషయం తెలిసిందే. మరికొందరు భారత మూలాలున్న విద్యార్థులు వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోయారు.

ఈ మరణాలపై భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి (Eric Garcetti) స్పందించారు. ‘‘ఎవరి పట్ల అన్యాయం జరిగినా అమెరికా తీవ్రంగా పరిగణిస్తుంది. చదువుకునేందుకు, సురక్షితంగా ఉండేందుకు భారతీయ విద్యార్థులకు అమెరికా ఉత్తమమైనది. దీనిపై భరోసా కలిగించేందుకు అమెరికా ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు