Hijab Protests: ఆందోళనల అణచివేత.. ఇరాన్‌పై బ్రిటన్‌ ఆంక్షలు!

ఇరాన్‌లోని నైతిక పోలీసు విభాగంపై ఆంక్షలు విధిస్తున్నట్లు బ్రిటన్‌ ప్రకటించింది. దీంతోపాటు ఈ విభాగం జాతీయ చీఫ్‌ మొహమ్మద్‌ గాచీ, టెహ్రాన్‌ డివిజన్‌ హెడ్‌ హజ్‌ అహ్మద్‌ మిర్జాయ్‌పైనా ఇదే విధమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.

Published : 12 Oct 2022 01:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలతో ఇరాన్‌(Iran) అట్టుడుకుతోన్న విషయం తెలిసిందే. మరోవైపు.. ఈ నిరసనలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌లోని నైతిక పోలీసు విభాగంపై ఆంక్షలు విధిస్తున్నట్లు బ్రిటన్‌(Britain) ప్రకటించింది. దీంతోపాటు ఈ విభాగం జాతీయ చీఫ్‌ మొహమ్మద్‌ గాచీ, టెహ్రాన్‌ డివిజన్‌ హెడ్‌ హజ్‌ అహ్మద్‌ మిర్జాయ్‌పైనా ఇదే విధమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. అమెరికా ఇప్పటికే ఈ తరహా ఆంక్షలు విధించగా.. యూరోపియన్‌ యూనియన్‌ సైతం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఒక సంస్థగా ఇరాన్‌ నైతిక పోలీసు విభాగంతోపాటు ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నట్లు బ్రిటన్‌ ఫారిన్‌, కామన్వెల్త్‌, డెవలప్‌మెంట్‌ ఆఫీస్‌(ఎఫ్‌సీడీవో) పేర్కొంది.

నిరసనకారులపై మందుగుండు వినియోగం, విద్యార్థులను దిగ్బంధించడం, భద్రతా సిబ్బంది చేతుల్లో మరణించినవారి మృతదేహాలను కుటుంబాలకు అప్పగించకుండానే ఖననం చేసినట్లు తమ వద్ద నివేదికలు ఉన్నాయని ఎఫ్‌సీడీవో తెలిపింది. ఇరాన్ ప్రజలకు బ్రిటన్‌ అండగా నిలుస్తుందని విదేశాంగ కార్యదర్శి జేమ్స్ క్లీవర్లీ పేర్కొన్నారు. మరో ఐదుగురు ఇరాన్‌ అధికారులపై వేరుగా ఆంక్షలు విధించినట్లు చెప్పారు. అయితే.. బ్రిటన్‌ నిర్ణయాన్ని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపై బ్రిటన్‌ రాయబారికి నిరసన తెలియజేసింది. ఇదిలా ఉండగా, మాసా అమీని అనే యువతి మృతితో ఇరాన్‌లో ప్రదర్శనలు మొదలయ్యాయి. ఆమె హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న అభియోగంపై అక్కడి నైతిక విభాగం పోలీసులు అరెస్టు చేయగా, వారి కస్టడీలో తీవ్రంగా గాయపడి మరణించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు