US Operation: అమెరికా సైనిక దాడిలో.. ISIS చీఫ్‌ హతం!

అమెరికా జరిపిన మెరుపు దాడిలో ఐఎస్‌ఐఎస్‌ కీలక నేత అబూ ఇబ్రహీం అల్‌-హషిమి అల్‌-ఖురేషీ హతమైనట్లు అమెరికా వెల్లడించింది.

Published : 04 Feb 2022 02:02 IST

వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌

వాషింగ్టన్‌: అమెరికా జరిపిన మెరుపు దాడిలో ఐఎస్‌ఐఎస్‌ కీలక నేత అబూ ఇబ్రహీం అల్‌-హషిమి అల్‌-ఖురేషీ హతమైనట్లు అమెరికా వెల్లడించింది. వాయువ్య సిరియాలో చేపట్టిన ఉగ్రవాద నిరోధక ప్రత్యేక ఆపరేషన్‌ను అమెరికా సైనిక దళాలు విజయవంతంగా పూర్తిచేసినట్లు పేర్కొంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు.

‘నా ఆదేశాల మేరకు సిరియాలో గతరాత్రి అమెరికా సైనిక దళాలు చేపట్టిన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌ విజయవంతంగా ముగిసింది. మా సాయుధ దళాల నైపుణ్యం, తెగువకు ధన్యవాదాలు. ఐఎస్‌ఐఎస్‌ నేత అబూ ఇబ్రహీంను తుదముట్టించాం. ఆ ఆపరేషన్‌ను పూర్తి చేసుకొని అమెరికన్లందరూ సురక్షితంగా తిరిగి వచ్చారు’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాన్నారు. ఈ ప్రత్యేక ఆపరేషన్‌ జరుగుతోన్న సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో పాటు అక్కడ జాతీయ భద్రతా బృందం సభ్యులు స్వయంగా పర్యవేక్షించినట్లు వైట్‌హౌస్‌ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేసింది.

ఇదిలాఉంటే, 2019 అక్టోబర్‌ నెలలో అమెరికా చేపట్టిన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌ వ్యవస్థాపకుడు అబూ బకర్‌ అల్‌-బాగ్దాది హతమయ్యాడు. అనంతరం ఐఎస్‌ఐఎస్‌ బాధ్యతలను అబూ ఇబ్రహీం చేపట్టారు. తాజాగా అమెరికా జరిపిన దాడిలో ఆయన కూడా అంతమయ్యాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని