Russia: ఐఫోన్లను పడేయండి.. అధికారులకు రష్యా అధ్యక్ష భవనం ఆదేశాలు

అధికారులు ఇక నుంచి ఐఫోన్‌ వాడొద్దని రష్యా అధ్యక్ష భవనం (Kremlin) నిర్ణయించింది. పాశ్చాత్య దేశాల నిఘా సంస్థల నుంచి ముప్పు ఉండవచ్చనే ఆందోళనల నడుమ ఈ చర్యలకు ఉపక్రమించినట్లు రష్యా (Russia) మీడియా వెల్లడించింది. 

Published : 22 Mar 2023 02:24 IST

మాస్కో: రష్యాలో (Russia) వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలకు సన్నాహాలు జరుగుతోన్న వేళ పుతిన్‌ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్ష భవన అధికారులు ఐఫోన్‌ వాడొద్దని సూచించింది. కొత్తవి కొనకూడదని.. ఇప్పటికే వాడుతున్న వాటిని పడేయాలని ఆదేశించింది. అమెరికా టెక్ దిగ్గజానికి చెందిన ఫోన్‌ (iPhone) కావడం, పాశ్చాత్య దేశాల నిఘా సంస్థల ముప్పు పొంచి ఉందనే ఆందోళనల నడుమ క్రెమ్లిన్‌ (Kremlin) ఈ చర్యలు తీసుకున్నట్లు రష్యా మీడియా వెల్లడించింది.

‘ఐఫోన్‌ పని ముగిసిపోయింది. దాన్ని పడేయండి లేదా పిల్లలకు ఇవ్వండి. మార్చి చివరి నాటికే ప్రతిఒక్కరు ఈ పని పూర్తి చేయాలి’ అని రష్యా అధ్యక్ష భవన (Kremlin)  పాలనాధికారి సెర్గీ కిరియెంకో అక్కడి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఐఫోన్‌ స్థానంలో ఇతర ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కలిగిన పరికరాలను అందించేందుకు క్రెమ్లిన్‌ సిద్ధమైనట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ ధ్రువీకరించనప్పటికీ.. అధికారిక కార్యకలాపాలకు మాత్రం స్మార్ట్‌ఫోన్లను వాడకూడదని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఎలాంటి ఆపరేటింగ్‌ సిస్టమైనా పూర్తి పారదర్శకతతో ఉంటాయన్నారు. ముఖ్యంగా అవి అధికారిక అవసరాల కోసం తయారు చేసినవి కావన్నారు.

మరోవైపు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్మార్ట్‌ఫోన్‌ వాడరని దిమిత్రి పెస్కోవ్‌ 2020లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అవి పూర్తి పారదర్శకత కలిగి ఉంటాయని.. వాటివల్ల గోప్యమైన సమాచారం లీకయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. అందుకే అత్యంత అరుదుగా మాత్రమే పుతిన్‌ ఇంటర్నెట్‌ వాడుతారని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని