Pakistan: పాక్‌ ఆర్మీచీఫ్‌గా ఇమ్రాన్‌ విరోధి అసీమ్‌ మునీర్‌..!

పాక్‌ ఆర్మీచీఫ్‌గా ఇమ్రాన్‌ ఖాన్‌ విరోధి అసీమ్‌ మునీర్‌ నియమితులయ్యారు. పుల్వామా ఆత్మాహుతి దాడి సమయంలో ఆయన ఐఎస్‌ఐ చీఫ్‌గా వ్యవహరించారు. దీంతో భారత్‌ ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తోంది. 

Published : 24 Nov 2022 14:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాక్‌ సైన్యం ఇమ్రాన్‌ఖాన్‌కు పెద్ద షాక్‌ ఇచ్చింది. ఆయనకు బద్ధవిరోధిగా పేరున్న లెఫ్టినెంట్‌ జనరల్‌ అసీమ్‌ మునీర్‌ను పాక్‌ ఆర్మీ చీఫ్‌గా నియమిస్తూ ప్రధాని షహెబాజ్‌ షరీఫ్‌ నిర్ణయం తీసుకొన్నారు. ఈ విషయాన్ని పాక్‌ సమాచారశాఖ మంత్రి మరియం ఔరంగజేబ్‌ ట్విటర్‌లో ప్రకటించారు. తొలుత ఈ పదవి కోసం లెఫ్టినెంట్‌ జనరళ్లు అసీమ్‌ మునీర్‌, షహిర్‌ షంషాద్‌ మిర్జా, అజర్‌ అబ్బాస్‌, నుమాన్‌ మహమ్మద్‌, ఫయాజ్‌ హమీద్‌లు పోటీపడ్డారు. వీరిలో అసీమ్‌ మునీర్‌ను పాక్‌ ఆర్మీ చీఫ్‌గా నియమించగా.. షంషాద్‌ మిర్జాను జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ ఛైర్మన్‌గా నియమించారు. దీనిపై సంతకాల కోసం దేశాధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ వద్దకు ఫైల్‌ను పంపించారు. అసీమ్‌మునీర్‌ రావల్పిండిలోని  పాక్‌ సైనిక ప్రధాన కార్యాలయంలో క్వార్టర్‌ మాస్టర్‌ జనరల్‌గా పనిచేస్తున్నారు. తన నియామక ఆర్డర్లు రావడంలో ఎటువంటి జాప్యం ఉండకపోవచ్చని అసీమ్‌ మునీర్‌ గురువారం పేర్కొన్నారు.

గతంలో ఇమ్రాన్‌ ఆగ్రహానికి గురైన జనరల్‌..

అసీమ్‌ మునీర్‌ అంటే మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు ఏమాత్రం గిట్టదనే ప్రచారం ఉంది. ఇమ్రాన్‌ భార్యపై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రస్తావించడమే మునీర్‌ చేసిన నేరం. దీంతో ఇమ్రాన్‌ అతడిని 30వ కోర్‌కు కమాండర్‌గా బదిలీ చేశారు. ఆయన ఐఎస్‌ఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టి అప్పటికి కేవలం ఎనిమిది నెలలు మాత్రమే అవుతోంది. మునీర్‌ స్థానంలో తనకు సన్నిహితుడైన ఫయాజ్‌ అహ్మద్‌ను ఇమ్రాన్‌ నియమించుకొన్న విషయం తెలిసిందే. తాజా అధికారిక పీఎంఎల్‌-ఎన్‌ పార్టీ మునీర్‌ పదోన్నతికి మద్దుతుగా నిలిచింది. ఇమ్రాన్‌ ఖాన్‌ కట్టడికి గట్టిగా కృషి చేస్తాడని భావిస్తోంది. ప్రస్తుత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బజ్వాతో కూడా ఖాన్‌కు ఏమాత్రం పొసగడంలేదు. ఇటీవల కాలంలో బహిరంగంగానే ఆర్మీ చీఫ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.

పుల్వామా దాడి వెనుక..

2019 ఫిబ్రవరిలో అసీమ్‌ మునీర్‌ పాక్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ ఐఎస్‌ఐ చీఫ్‌గా ఉన్న సమయంలో పుల్వామాలో భారత భద్రతా దళాలపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఐఎస్‌ఐ కనుసన్నల్లోనే పాక్‌ ఉగ్రవాదులు పనిచేస్తారన్న విషయం తెలిసిందే. అప్పట్లో కీలక సైనిక కార్యకలాపాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో అతడి పాత్ర కీలకం. భారత్‌పై ఆపరేషన్స్‌లో మునీర్‌కు అనుభవం ఉంది. కొత్త జనరల్‌ నియామకం భారత్‌-పాక్‌ సంబంధాలపై కూడా ప్రభావం చూపనుంది. ప్రస్తుత జనరల్‌ బజ్వా 2021లో భారత్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో కొత్త జనరల్‌ విధానం ఎలా ఉంటుందనేది భారత్‌ జాగ్రత్తగా గమనిస్తోంది. గతంలో కమర్‌ జావెద్‌ బజ్వా కింద మునీర్‌  బ్రిగేడియర్‌గా పనిచేశారు. ఆ తర్వాత 2017లో పాక్‌ మిలటరీ ఇంటెలిజెన్స్‌లో డైరెక్టర్‌ జనరల్‌గా విధులు నిర్వహించారు. 2018 అక్టోబర్‌లో ఐఎస్‌ఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 30వ కోర్‌ జనరల్‌గా.. అనంతరం క్వార్టర్‌ మాస్టర్‌ జనరల్‌గా పనిచేశారు.

అత్యంత నాటకీయంగా..

ఆర్మీ చీఫ్‌ రేసులో మునీర్‌ చాలా నాటకీయంగా వచ్చి చేరారు. 2018 సెప్టెంబర్‌ ముందు వరకు ఆయన టూ స్టార్‌ జనరల్‌ మాత్రమే. ఆయన ఆ తర్వాత పదోన్నతులతో ఆయన లెఫ్టినెంట్‌ జనరల్‌గా ఎదిగారు. పాక్‌ సైన్యం నిబంధనల ప్రకారం లెఫ్టినెంట్‌ జనరల్‌గా నాలుగేళ్లు పనిచేస్తేనే ఆర్మీచీఫ్‌గా అవకాశం లభిస్తుంది. బజ్వా పదవీ విరమణ చేయనున్న నవంబర్‌ 29కి సరిగ్గా రెండు రోజుల ముందు (27వ తేదీ)తో లెఫ్టినెంట్‌ జనరల్‌గా మునీర్‌ నాలుగేళ్ల పదవీకాలం పూర్తవుతుంది. ఆ రోజు ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ, ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఆయన్ను ఆర్మీచీఫ్‌గా ఎంపిక చేశారు. ఫలితంగా మూడేళ్లు.. అంటే 2025 వరకు మునీర్‌ ఈ పదవిలో కొనసాగే అవకాశం లభిస్తుంది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts