Xylazine: ‘జాంబీ డ్రగ్‌’తో వణుకుతోన్న లాస్‌ ఏంజిల్స్‌

‘జాంబీ డ్రగ్‌’గా పేర్కొనే ఓ (Xylazine) మత్తుపదార్థం వినియోగం విపరీతంగా పెరగడంతో అమెరికా నగరం లాస్‌ ఏంజిల్స్‌ (Los Angeles) ఆందోళన చెందుతోంది.

Published : 15 May 2023 18:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మాదక ద్రవ్యాల మత్తులో మునిగిపోతున్న వారితో అమెరికాలోని పలు నగరాలు నిండిపోతున్నాయి. ముఖ్యంగా మత్తుకు బానిసలుగా చేసే ప్రమాదకరమైన పదార్థాలతోపాటు చర్మాన్ని భక్షించే గుణమున్న డ్రగ్స్‌ వినియోగం అక్కడ భారీగా పెరిగింది. ‘జాంబీ డ్రగ్‌’గా (Zombie Drug) పేర్కొనే ఓ మాదకద్రవ్యం వాడకం విపరీతంగా పెరగడంతో లాస్‌ ఏంజిల్స్‌ (Los Angeles) ఆందోళన చెందుతోంది. దీంతో అప్రమత్తమైన అక్కడి అధికారులు.. ఈ డ్రగ్‌ వినియోగ కట్టడికి ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమయ్యారు.

ఏమిటీ జైలజైన్‌..?

జైలజైన్‌ (Xylazine) అనేది ఓ మత్తుపదార్థం. ఆవులు, గుర్రాల్లో ఉద్రేకాన్ని తగ్గించే మత్తుపదార్థంగా దీన్ని వినియోగిస్తారు. అయితే, ఇది నిషేధిత జాబితాలో లేదు. అందుకే ట్రాంక్‌గా పిలిచే ఈ మత్తుపదార్థాన్ని హెరాయిన్‌, ఫెంటానైల్‌ వంటి డ్రగ్స్‌తో కలిపి వాడుతుంటారు. ఇవి వాడటం వల్ల చర్మంపై తీవ్ర దుష్ర్పభావం కనిపిస్తుంది. చర్మంపై పుండ్లు ఏర్పడటంతోపాటు శరీర భాగాలను కుళ్లిపోయేలా చేస్తుంది. చికిత్సకు లొంగకపోతే ఆయా శరీర భాగాలను తొలగించాల్సి ఉంటుంది. మోతాదు ఎక్కువైతే ప్రాణాలు కూడా కోల్పోతారు. ఇంజెక్షన్‌ రూపంలో తీసుకోవడంతో రక్తనాళాలను బలహీన పరిచి రక్తం సరఫరా మందగించేలా చేస్తుంది. చర్మాన్ని కుళ్లించే ప్రభావం ఉండటంతో దీన్ని మాంసభక్షక డ్రగ్‌ అని పిలుస్తారు. అంతేకాకుండా ఇది పీల్చిన వారు మితిమీరిన మత్తులో ఉండటం వల్ల దీన్ని జాంబీ డ్రగ్‌ అని కూడా అంటారు.

అమెరికా వ్యాప్తంగా..

అమెరికా గణాంకాల ప్రకారం.. గతేడాది పట్టుబడిన మాదక ద్రవ్యాల్లో 23శాతం జైలజైన్‌తో కూడిన ఫెంటానిల్‌ పౌడర్‌ ఉండగా.. ఏడు శాతం ఫెంటానిల్‌ బిళ్లలు ఉన్నట్లు తేలింది. గతంలో జరిపిన డోప్‌ నమూనా పరీక్షల్లో ఎక్కువగా జైలజైన్‌ ఉన్నట్లు వెల్లడైంది. అమెరికా నగరాల్లో వీటి వాడకం విపరీతంగా పెరిగింది. న్యూయార్క్‌లోని వీటి వాడకం వల్ల పదుల కొద్ది మరణాలు సంభవించాయని అక్కడి చట్టసభ సభ్యుడు ఇటీవల వెల్లడించారు. లాస్‌ ఏంజిల్స్‌లోనూ ఈ కేసులు పెరగడంతో అక్కడి అధికారులు డ్రగ్స్‌ కట్టడికి ఉపక్రమించారు. నగర వీధుల్లో జైలజైన్‌ వాడకంపై దృష్టి పెట్టడంతోపాటు ముందుగానే అటువంటివారిని గుర్తించడంపై శ్రద్ధ పెట్టినట్లు డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌తోపాటు లాస్‌ ఏంజిల్స్‌ కౌంటి ఆరోగ్య అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని