USA: టీనేజర్ల వ్యక్తిగత సమాచార సేకరణ ఆరోపణలు.. మెటాపై 33 రాష్ట్రాలు దావా

ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram), ఫేస్‌బుక్‌ల (Facebook) మాతృసంస్థ ‘మెటా’ (Meta).. 13 ఏళ్లలోపు పిల్లల వ్యక్తిగత సమాచాన్ని సేకరించిందని ఆరోపిస్తూ అమెరికాలో పలు రాష్ట్రాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.

Published : 27 Nov 2023 14:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాలు (Social Media) యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇదే అంశంపై అమెరికాలోని పలు రాష్ట్రాలు ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram), ఫేస్‌బుక్‌ల (Facebook) మాతృసంస్థ ‘మెటా’ (Meta).. 13 ఏళ్లలోపు పిల్లల వ్యక్తిగత సమాచాన్ని సేకరించిందని.. ఇది బహిరంగ రహస్యమని ఆరోపించాయి. దీనికి సంబంధించి లక్షల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినప్పటికీ వాటిలో కొన్నింటిని మాత్రమే తొలగించిందని పేర్కొన్నాయి. గత నెలలో వేసిన ఈ దావాలోని వివరాలు తాజాగా బయటకు వచ్చాయి.

‘యుక్త వయసు పిల్లలను ప్రలోభపెట్టడానికి శక్తిమంతమైన సాంకేతికతలను మెటా (Meta) ఉపయోగిస్తోంది. సామాజిక మాధ్యమాల (Social Media) వేదికలతో కలిగే ప్రమాదాలపై పౌరులను మెటా పదేపదే తప్పుదోవ పట్టించింది. చిన్నారులు, యుక్తవయసు పిల్లల సమాచారాన్ని తారుమారు చేయడం వంటి విషయాలను ఈ సంస్థ దాచిపెట్టింది’ అని 33 రాష్ట్రాలు వేసిన దావాలో పేర్కొన్నాయి. తల్లిదండ్రుల అనుమతి లేకుండా 2019 నుంచి 13 ఏళ్ల కంటే తక్కువ వయసున్న లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) యూజర్ల సమాచారాన్ని తీసుకుందని ఆరోపించాయి.

‘ఎలాన్‌ మస్క్‌ అయితే ఏంటీ.. అది తప్పే’: రిషి సునాక్‌

అంతేకాకుండా అత్యధిక సమయం సామాజిక మాధ్యమాల్లో గడిపే విధంగా బిజినెస్‌ మోడల్‌ను ‘మెటా’ రూపొందించిందని ఆయా రాష్ట్రాలు వేసిన దావాలో ఆరోపించాయి. ఇందుకోసం అనేక ఫీచర్లను సృష్టించిందని వెల్లడించాయి. ఇదే సమయంలో వాటివల్ల కలిగే ప్రమాదాలకు సంబంధించిన నివేదికలను దాచిపెట్టి.. తక్కువ హాని కలిగించే నివేదికలను ప్రచురించి తప్పుదోవ పట్టించిందని తెలిపింది. ఇలా చిన్నారుల గోప్యతా చట్టాలను పాటించడంలో విఫలమైందని ఆయా రాష్ట్రాలు చేసిన ఆరోపణలపై మెటా స్పందించింది. 13ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు ఈ ఖాతాలు తెరచేందుకు అనుమతి లేదని, అటువంటి ఖాతాలు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే తొలగించే చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని