China: కొవిడ్‌ నిబంధనల ఎత్తివేత తర్వాత ప్రపంచ యాత్రపై చైనీయుల ఆసక్తి..!

కొవిడ్‌ నిబంధనలు సడలించనున్నట్లు చైనా(china) ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అక్కడి ప్రజలు విదేశీ పర్యటనలకు ఆసక్తి చూపుతున్నారు. 

Updated : 28 Dec 2022 11:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దాదాపు మూడేళ్లపాటు జీరోకొవిడ్‌ పాలసీ కారణంగా దేశానికే పరిమితమైన చైనీయులు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పర్యటనలకు సిద్ధమవుతున్నారు. జనవరి 8వ తేదీ నుంచి చైనా(china)లో కొవిడ్‌ క్వారంటైన్‌ నిబంధనలు పూర్తిగా సడలించనున్నట్లు మంగళవారం ప్రకటించారు. దీంతో అక్కడి ప్రజలు ప్రపంచ పర్యటన స్థలాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సోమవారం దీనికి సంబంధించిన వార్తలు వెలువడినప్పటి నుంచి ట్రావెల్‌ వెబ్‌సైట్లకు రద్దీ విపరీతంగా పెరిగింది. చైనా(china) మీడియా లెక్కల ప్రకారం నిబంధనల సడలింపుపై ప్రచారం మొదలైన అరగంటలోనే ట్రావెల్‌ సైట్ల కోసం వెతికిన వారి సంఖ్య ఒక్కసారిగా 10 రెట్లు పెరిగింది. చైనా(china) ట్రావెల్‌ ఏజెన్సీ క్యూనరా వద్ద విమానాలపై ఆరా తీసిన వారి సంఖ్య ఏడు రెట్లు ఎక్కువగా ఉంది.

మరోవైపు రోజువారీ విమనాల సంఖ్యపై పరిమితిని కూడా చైనా (china)ఎత్తివేసింది. దీంతోపాటు జనవరి 8వ తేదీన కొవిడ్‌ స్థాయి తగ్గించి బి-గ్రేడ్‌ ఇన్ఫెక్షన్‌గా ప్రకటించనుంది. మరోవైపు భారీ సంఖ్యలో ప్రజలు విదేశాలకు వెళ్లకుండా చూసేందుకు చైనా(china) గ్రూప్‌, ప్యాకేజీ ట్రావెల్స్‌ను నిషేధించిందని డ్రాగన్‌ ట్రెయిల్‌ ఇంటర్నేషనల్‌ అనే మార్కెటింగ్‌ కంపెనీ పేర్కొంది. చైనీయులు ఎక్కువగా మకావ్‌, హాంకాంగ్‌, జపాన్‌, థాయ్‌ల్యాండ్‌, దక్షిణ కొరియాకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొవిడ్‌కు ముందు 2019లో చైనా(china) నుంచి ఏడాదిలో 15.5 కోట్ల మంది ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. కొవిడ్‌ మొదలైన 2020లో ఈ సంఖ్య 2 కోట్లకు పడిపోయింది. దీంతో ఈ సారి జనవరి 22తో మొదలయ్యే లూనార్‌ న్యూఇయర్‌లో వివిధ ప్రాంతాల్లోని తమ బంధువులను కలుసుకొనేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు.

మరో పక్క చైనా(china)లో కొవిడ్‌ వేవ్‌ను చూసిన చాలా దేశాలు అక్కడి నుంచి వచ్చేవారిపై కఠిన ఆంక్షలను విధించాయి. ముఖ్యంగా చైనా (china)పర్యాటకులు జపాన్‌ వెళ్లడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కానీ,  జపాన్‌ మాత్రం చైనా (china)నుంచి వచ్చే పర్యాటకులపై ఆంక్షలు విధించింది. జపాన్‌ చేరుకొన్నాక కొవిడ్‌ పరీక్షలో నెగెటివ్ రావాలని.. లేని పక్షంలో కనీసం వారం రోజులు క్వారంటైన్‌ ఉండాలని పేర్కొంది. ఇక భారత్‌లో కూడా చైనా, కొన్ని ఇతర దేశాల నుంచి వచ్చే వారికి కూడా కొవిడ్‌ టెస్ట్‌లో నెగెటివ్‌ వస్తేనే దేశంలోకి ప్రవేశం ఉంటుంది. మలేసియా కూడా చైనీయులను ట్రాకింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. అమెరికా కూడా చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షల విధించే అవకాశాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని