Modi: ఐరోపా పర్యటనలో మోదీ.. మూడోరోజు బిజీబిజీగా..!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల ఐరోపా పర్యటన నేటితో ముగియనుంది. ఈ పర్యటనలో చివరి రోజు ప్రధాని మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు.

Published : 04 May 2022 23:34 IST

ఆయా దేశాధినేతలతో వరుస భేటీలు

కోపెన్‌హాగెన్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల ఐరోపా పర్యటన నేటితో ముగియనుంది. ఈ పర్యటనలో చివరి రోజు ప్రధాని మోదీ బిజీబిజీగా ఉన్నారు. జర్మనీ పర్యటన అనంతరం డెన్మార్క్‌ చేరుకున్న మోదీ.. ఆ దేశ ప్రధానితో చర్చల అనంతరం నేడు ఇతర దేశాధినేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా ఐస్‌లాండ్‌, నార్వే, ఫిన్‌లాండ్‌ ప్రధానమంత్రులతో సమావేశమైన మోదీ.. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలతోపాటు అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు.

బెర్లిన్‌ పర్యటన ముగించుకొని డెన్మార్క్‌ చేరుకున్న మోదీ.. ఆ దేశ ప్రధాని ఫ్రెడెరకిక్సన్‌తో కోపెన్‌హాగెన్‌లో భేటీ అయ్యారు. అనంతరం రెండవ ఇండియా-నార్డిక్‌ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐస్‌లాండ్‌, స్వీడన్‌, నార్వే, ఫిన్‌లాండ్‌ దేశాల ప్రధాన మంత్రులతోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తిరుగు ప్రయాణంలో భాగంగా పారిస్‌ చేరుకోనున్న మోదీ.. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ తోనూ సమావేశమవుతారు.

మూడో రోజు పర్యటనలో భాగంగా కోపెన్‌హాగెన్‌లో ఉన్న మోదీ, నేడు తొలుత నార్వే ప్రధానిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చించడంతోపాటు వివిధ అంశాల్లో పూర్తి సహకారాన్ని అందిపుచ్చుకునే అంశాలపై చర్చించారు. అనంతరం స్వీడన్‌ ప్రధాని మాగ్డలీనా అండర్సన్‌తో సమావేశమైన మోదీ.. ఇరు దేశాల స్నేహాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై విస్తృత చర్చలు జరిపారు. తర్వాత ఐస్‌లాండ్‌ ప్రధాని కత్రిన్‌ జాకబ్స్‌తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వాణిజ్యం, ఇంధనం, ఫిషరీస్‌తోపాటు మరిన్ని అంశాలపై చర్చించారు. ఫిన్‌లాండ్‌ ప్రధాని మారిన్‌సనాతోనూ సమావేశమైన మోదీ .. ఇరుదేశాల భాగస్వామ్యం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ అంశాలపై ఇరుదేశాధినేతలు చర్చించారు.

దిలాఉంటే, మూడురోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌తో భేటీ అయ్యారు. ఆరో దఫా అంతర్‌ ప్రభుత్వ సంప్రదింపుల (ఐసీజీ) సమావేశంలోనూ ఇరుదేశాల ప్రతినిధి బృందాలు పాల్గొన్నాయి. రెండోరోజు డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగెన్‌ చేరుకున్న మోదీ.. ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్‌తో ప్రత్యేకంగా సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. పర్యటన చివరిరోజైన నేడు ఆయా దేశాల ప్రధానులు, వ్యాపారవేత్తలతో వరుస భేటీలతో మోదీ బిజీబిజీగా ఉన్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని