Putin: భారతీయులు టాలెంటెడ్‌.. పుతిన్‌ ప్రశంసల వర్షం

భారత్‌పై వరుసగా ప్రశంసలు కురిపిస్తున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌. ఇటీవలే ప్రధాని మోదీ విదేశాంగ విధానాన్ని పొగిడిన ఆయన.. తాజాగా భారతీయుల నైపుణ్యాన్ని కొనియాడారు.

Updated : 05 Nov 2022 14:14 IST

మాస్కో: భారతీయులు ప్రతిభావంతులు అని, అభివృద్ధిలో అత్యుత్తమ ఫలితాలను సాధించగలిగే సమర్థులని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ కొనియాడారు. నవంబరు 4న రష్యా ఐక్యతా దినోత్సవం సందర్భంగా మాస్కోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పుతిన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ చిరకాల మిత్రదేశమైన భారత్‌పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.

‘‘భారత్‌ను చూడండి.. దేశ అభివృద్ధి కోసం కృషి చేసే ఎంతో మంది ప్రతిభావంతులు అక్కడ ఉన్నారు. దాదాపు 150 కోట్ల మందితో ఇప్పుడు భారత్‌ సమర్థవంతమైన దేశంగా ఉంది. అభివృద్ధిలో కచ్చితంగా అత్యుత్తమ ఫలితాలను సాధిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు’’ - పుతిన్‌

గత వారం భారత ప్రధాని నరేంద్ర మోదీని పుతిన్‌ పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన స్వతంత్ర విదేశాంగ విధానంతో భారత్‌ మరింత పురోగతి సాధించిందని కొనియాడారు. మోదీ గొప్ప దేశభక్తుడని అభివర్ణించారు. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయినందుకు భారత్‌ గర్వించాలి. భవిష్యత్తు భారత్‌దే’’ అని పుతిన్‌ ప్రశంసించారు.

ఇదీ చదవండి: మోదీని పొగిడిన పుతిన్‌..!

కాగా, వచ్చే వారంలో భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ రష్యా పర్యటన నేపథ్యంలో.. భారతీయులపై పుతిన్‌ ప్రశంసలు కురిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నవంబరు 7-8 తేదీల్లో జైశంకర్‌ మాస్కోలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో ద్వైపాక్షిక భేటీలో పాల్గొననున్నారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారంపై వీరు చర్చించనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు