Ukraine Crisis: ఉక్రెయిన్‌ను మూడు ముక్కలు చేసిన పుతిన్‌..

ప్రపంచం భయపడినంతా అయింది.. తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటు వాద ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా గుర్తిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated : 22 Feb 2022 10:52 IST

  నాటోకూటమికి సవాల్‌ విసిరిన రష్యా

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ప్రపంచం భయపడినంతా అయ్యింది.. తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటు వాద ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా గుర్తిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రస్తుతం ఉక్రెయిన్‌ను మూడు ప్రాంతాలుగా ముక్కలు చేసినట్లైయింది. అప్పటికే ఉన్న ఉక్రెయిన్‌కు తోడు.. దొనెట్స్క్‌,లుహాన్స్క్‌ ప్రాంతాలు దేశాలుగా ఏర్పడినట్లు రష్యా గుర్తించింది. అంతటితో ఆగకుండా.. ఆ కొత్త దేశాల్లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు శాంతి పరిరక్షక దళాల పేరిట రష్యా సేనలను పంపించాలని ఆదేశాలు జారీ చేశారు.  అంతేకాదు.. అసలు ఉక్రెయిన్‌ ఉనికినే పుతిన్‌ ప్రశ్నించడం పశ్చిమ దేశాలను భయపెట్టింది.

అసలేం జరిగింది..?

పుతిన్‌ అధ్యక్షతన సోమవారం రష్యా సెక్యూరిటీ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభ్యులు తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలకు స్వతంత్ర దేశాలుగా గుర్తింపు ఇవ్వాలని అధ్యక్షుడిని కోరారు.  అదే సమయంలో ఉక్రెయిన్ దళాలు ఇక్కడ దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కౌన్సిల్‌లో మిలటరీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌లు, విదేశాంగ మంత్రి లావ్రోవ్‌, ప్రధాని మిఖాయిల్‌ మిస్‌హస్టిన్‌ తదితరులు ఉన్నారు.

ఉక్రెయిన్‌ అణ్వాయుధాలు చేస్తుంది..

రష్యా జాతీయ టీవీలో నిన్న అధ్యక్షుడు పుతిన్‌ ప్రసంగిస్తూ పశ్చిమ దేశాల చేతిలో ఉక్రెయిన్‌ ఓ కీలుబొమ్మగా  మారిందని అభివర్ణించారు. అక్కడ రష్యా భాష మాట్లాడేవారిని అణచివేస్తున్నారని ఆరోపించారు. ‘‘ఉక్రెయిన్‌కు అసలు ఎప్పుడూ సొంత దేశం హోదా లేదు. దానికి ఎప్పుడూ స్థిరమైన రాజ్యాధికారం కూడా లేదు. ఉక్రెయిన్‌ సొంతగా అణ్వాయుధాలు తయారు చేయగలదు. దానికి పశ్చిమ దేశాలు సాయం చేసే అవకాశం ఉంది. అదే అసలైన ముప్పు’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

రెండు స్వతంత్ర దేశాలుగా గుర్తింపు..

సుదీర్ఘ టెలివిజన్‌ ప్రసంగం అనంతరం పుతిన్‌ తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటు వాద ప్రాంతాలైన దొనెట్స్క్‌,లుహాన్స్క్‌ ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. సంబంధిత డిక్లరేషన్‌పై సంతకం చేశారు. అదే సమయంలో వేర్పాటు వాద ప్రాంత నాయకులు పుతిన్‌ను సైనిక సాయం కోరారు. దీంతో రష్యా తరఫున శాంతి పరిరక్షక దళాలను పంపాలని పుతిన్‌ నిర్ణయించారు. ఉక్రెయిన్‌ నరమేధానికి పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. దీంతో ఉక్రెయిన్‌పై దాడి చేయడానికి దీనిని ఓ సాకుగా చూపించే అవకాశం ఉందని పశ్చిమ దేశాలు అనుమానిస్తున్నాయి.

తూర్పు ఉక్రెయిన్‌లోకి రష్యా సేనలు..

తూర్పు ఉక్రెయిన్‌లోని స్వతంత్ర దేశాలుగా ప్రకటించుకొన్న దొనెట్స్క్‌ , లుహాన్స్క్‌ ప్రాంతాలకు రష్యా సేనలు వెళతాయని ప్రకటించారు. అక్కడ శాంతిని కాపాడేందుకు తమ దళాలు వెళుతున్నట్లు ఆయన సమర్థించుకొన్నారు. దీనికి సంబంధించిన అధ్యక్షుడి ఆదేశాలను రష్యా టీవీలో ప్రసారం చేశారు. అదే సమయంలో ఆ  రెండు దేశాల్లో సైనిక స్థావరాలు నిర్మించేందుకు పదేళ్లపాటు ఒప్పందం కుదుర్చుకొంది. దీనికి సంబంధించిన పత్రాలను కూడా రష్యా ప్రభుత్వ మీడియా సంస్థ ఆర్‌ఐఏ నొవస్టీ ప్రచురించింది.

రష్యాపై ఆంక్షల కొరడా..

రష్యాపై నాటోకూటమి దేశాలు పలు ఆంక్షలు విధించాయి. వీటిల్లో ఐరోపా సమాఖ్య, బ్రిటన్‌, అమెరికా వంటి దేశాలు ఉన్నాయి.

* ఉక్రెయిన్‌ నుంచి వేర్పడిన దొనెట్స్క్‌,లుహాన్స్క్‌ ప్రాంతాలతో అమెరికా ఎటువంటి వ్యాపారం చేయకుండా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రాంతాల్లో అమెరికా వాసులు ఎటువంటి పెట్టుబడులు పెట్టరు. ఆ ప్రాంతానికి చెందిన సరుకులు, ఇతర సేవలను, టెక్నాలజీని ఏ రూపంలోనూ అమెరికా దిగుమతి చేసుకోకుండా ఆంక్షలు అడ్డుకోనున్నాయి.

* ఇక రష్యాపై విధించనున్న ఆంక్షలను నేడు అమెరికా ప్రకటించనుంది. ఈ విషయాన్ని శ్వేతసౌధం వెల్లడించినట్లు ఆంగ్ల వార్త సంస్థ బీబీసీ పేర్కొంది. మాస్కో నిర్ణయాలు, చర్యలకు ప్రతిస్పందన నేడు ఉంటుందని శ్వేత సౌధం ప్రతినిధి పేర్కొన్నారు.

* ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని తగ్గించేలా పాలసీలు చేసిన ఐదుగురు డుమా సభ్యులు(రష్యా పార్లమెంట్‌ దిగువసభ)పై ఆంక్షలు విధించారు. వీరు గతంలో క్రిమియా ఆక్రమణలో కీలక పాత్ర పోషించారు. గతేడాది పార్లమెంట్‌కు ఎంపికయ్యారు.

* రష్యాపై ఆంక్షలు విధించనున్నట్లు బ్రిటన్‌ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ ట్విటర్‌లో ప్రకటించారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఉక్రెయిన్‌ సార్వభౌమత్వానికి భంగం కలిగించిందని ఆరోపించారు. మంగళవారం ప్రధాని బోరిస్‌  జాన్సన్‌ నేతృత్వంలో సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని