Ukraine Crisis: పుతిన్‌జీ.. నేరుగా జెలెన్‌స్కీతో మాట్లాడండి..!

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో నేరుగా చర్చలు జరపాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను జర్మనీ, ఫ్రాన్స్‌ అధినేతలు అభ్యర్థించారు.

Updated : 29 May 2022 11:15 IST

 జర్మనీ, ఫ్రాన్స్‌ అధినేతల విజ్ఞప్తి

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో నేరుగా చర్చలు జరపాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను జర్మనీ, ఫ్రాన్స్‌ అధినేతలు అభ్యర్థించారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానియేల్‌ మాక్రాన్‌, జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ దాదాపు 80 నిమిషాలపాటు రష్యా అధ్యక్షుడితో ఫోన్‌లో చర్చలు జరిపారు. అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగారంలో బంధించిన దాదాపు 2,500 మంది ఉక్రెయిన్‌ ఫైటర్లను విడుదల చేయాలని కూడా కోరారు. తక్షణమే కాల్పుల విమరణ ప్రకటించి.. రష్యా దళాలను వెనక్కి పిలిపించాలని పేర్కొన్నట్లు జర్మనీ ఛాన్స్‌లర్‌ కార్యాలయం వెల్లడించింది.

ఉక్రెయిన్‌కు చెందిన ఒడెస్సా పోర్టుకు వెళ్లకుండా రష్యా దళాలు ఏర్పాటు చేసిన అడ్డంకులను తొలగించి ఆహార ధాన్యాల ఎగుమతికి సహకరించాలని ఫ్రాన్స్‌, జర్మనీ నేతలు కోరారు. దీనికి స్పందించిన పుతిన్‌ అవకాశాలను పరిశీలిస్తామని వెల్లడించారు.. అదే సమయయంలో రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలను తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరాపై ఫ్రాన్స్‌, జర్మనీలను హెచ్చరించారు.

ఈ అంశంపై క్రెమ్లిన్‌ ప్రతినిధి మాట్లాడుతూ చర్చలకు మాస్కో ఎప్పుడూ సిద్ధంగానే ఉందని పేర్కొన్నారు. అదే సమయంలో జెలెన్‌స్కీతో పుతిన్‌ చర్చలు జరపడానికి ఉన్న అవకాశాలను మాత్రం వెల్లడించలేదు. ఇప్పటికే యుద్ధం మొదలైన నాటి నుంచి రష్యా-ఉక్రెయిన్‌ ప్రతినిధులు పలు దఫాలు చర్చలు జరిపారు. కానీ, తర్వాత అవి నిలిచిపోయాయి. ఇటీవల ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. తాను చర్చలకు తొందరపడటంలేదని పేర్కొన్నారు. కానీ, యుద్ధాన్ని ఆపాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని