Queen Elizabeth: ఎలిజబెత్‌ రాణికి కరోనా పాజిటివ్‌

బ్రిటన్‌ మహారాణి ఎలిజబెత్‌-2(95) కరోనా బారిన పడ్డారు. కొవిడ్‌ పరీక్షలు చేయగా ఆమెకు ఆదివారం పాటిజివ్‌గా తేలినట్లు......

Published : 21 Feb 2022 01:34 IST

లండన్‌: బ్రిటన్‌ మహారాణి ఎలిజబెత్‌-2(95) కరోనా బారిన పడ్డారు. కొవిడ్‌ పరీక్షలు చేయగా ఆమెకు ఆదివారం పాటిజివ్‌గా తేలినట్లు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ వెల్లడించింది. మహారాణికి జలుబు లాంటి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్లు పేర్కొంది. ఎలిజబెత్‌ తన విండ్సర్ కాజిల్ నివాసంలో ఉన్నారని, రాబోయే కొద్దిరోజులపాటు ఆమె తన విధులను పరిమితం చేసుకోనున్నట్లు తెలిపింది. వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతున్నట్లు ప్యాలెన్‌ వెల్లడించింది. మహారాణి కుమారుడు ప్రిన్స్ చార్లెస్‌కు ఈనెల 10న పాజిటివ్‌గా నిర్ధరణ అయిన విషయం తెలిసిందే.

కొవిడ్‌ సోకినా ఐసోలేషన్‌ అక్కర్లేదు

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో బ్రిటన్​ సర్కారు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చేవారం నుంచి కరోనా బాధితులు స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ‘కొవిడ్​తో సహాజీవనం’ ప్రణాళికలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్లాన్​కు సంబంధించిన వివరాలను ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్​ సోమవారం ​పార్లమెంట్‌లో వెల్లడించనున్నారు.

కరోనా వైరస్​ వ్యాప్తిని అరికట్టడానికి అమలు చేసిన అన్ని చట్టపరమైన ఆంక్షలు ముగింపు దశకు వచ్చినట్లు బోరిస్‌ పేర్కొన్నారు. తద్వారా బ్రిటన్​ ప్రజలు తమ స్వేచ్ఛకు భంగం కలకుండా తమను తాము రక్షించుకోగలుగుతారు అని బోరిస్​ వ్యాఖ్యానించారు. అయితే, ఇది ప్రమాదకరమైన చర్య అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొవిడ్ మరింత ప్రబలి.. కేసులు పెరగడానికి దారితీయవచ్చని భావిస్తున్నారు. భవిష్యత్​లో మరింత ప్రమాదకరమైన కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి దేశ ఆరోగ్యరక్షణను బలహీనపరుస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని