ఇంధనం కటకట..! రఫా ఆస్పత్రులపై ‘డబ్ల్యూహెచ్‌వో’ ఆందోళన

రఫాలో వైద్య కార్యకలాపాల నిర్వహణకు మూడు రోజులకు సరిపడా మాత్రమే ఇంధన నిల్వలు ఉన్నట్లు ‘డబ్ల్యూహెచ్‌వో’ ఆందోళన వ్యక్తంచేసింది.

Published : 09 May 2024 17:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణ గాజాలోని రఫా (Rafah) నగరంపై ఇజ్రాయెల్‌ (Israel) దాడి చేయడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. దాదాపు 13- 14 లక్షల మంది పాలస్తీనియన్లు తలదాచుకుంటున్న ఈ ప్రాంతంపై దాడి చేస్తే భారీ మానవ సంక్షోభం తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తంచేసింది. దక్షిణ గాజాలో వైద్య కార్యకలాపాల నిర్వహణ కోసం కేవలం మూడు రోజులకు సరిపడా మాత్రమే ఇంధన నిల్వలు ఉన్నట్లు తెలిపింది. ఇంధనం కొరత కారణంగా రఫాలో మిగిలి ఉన్న మూడు ఆస్పత్రుల్లో ఇప్పటికే ఒకటి మూత పడినట్లు చెప్పింది. మరోవైపు ఉత్తర గాజా పూర్తి కరవు స్థితిలో ఉందని ఐరాస పేర్కొంది.

‘బైడెన్‌ అంటే హమాస్‌కు ప్రేమ..’

ఇజ్రాయెల్‌కు సరఫరా చేయాల్సిన ఆయుధాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్‌ తాజాగా ఇదే విషయాన్ని స్పష్టంచేశారు. ‘‘ఇజ్రాయెల్‌ ఆత్మరక్షణకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. ఐరన్ డోమ్ రాకెట్ ఇంటర్‌సెప్టర్లు, ఇతర ఆయుధాలను సరఫరా చేస్తాం. అయితే.. రఫాపై దాడుల విషయంలో మాత్రం ఆయుధాలు, ఫిరంగి గుండ్లను సరఫరా చేయబోం’ అని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బైడెన్‌ తెలిపారు. ఆయుధాల నిలిపివేత వ్యవహారంపై ఇజ్రాయెల్‌ జాతీయ భద్రత వ్యవహారాల శాఖ మంత్రి ఇటామర్‌ బెన్‌ గ్విర్‌ స్పందిస్తూ.. ‘బైడెన్‌ అంటే హమాస్‌కు ప్రేమ’ అని వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని