Rishi Sunak: భారత్‌తో వాణిజ్య ఒప్పందంలో రిషి కుటుంబానికి లబ్ధి.. బ్రిటన్‌ ప్రధానిపై ఆరోపణలు

బ్రిటన్‌ ప్రధాని రుషి సునాక్‌పై మరోసారి విమర్శలు చెలరేగాయి. భారత్‌తో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంలో ఆయన కుటుంబం లబ్ధిపొందుతుందని విపక్షాలు అనుమానం వ్యక్తం చేశాయి.  

Updated : 27 Aug 2023 16:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యూకే (UK) ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak) మరో వివాదంలో చిక్కుకొన్నారు. బ్రెగ్జిట్‌ తర్వాత ప్రతిపాదిత భారత్‌-బ్రిటన్‌ వాణిజ్య ఒప్పందం నుంచి సునాక్‌ కుటుంబం లబ్ధి పొందనుందనే ఆరోపణలొచ్చాయి. ప్రస్తుతం ఈ ఒప్పందంపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో రిషి సునాక్‌ భార్య అక్షితా మూర్తికి ఇన్ఫోసిస్‌లో 500 మిలియన్‌ డాలర్ల విలువైన షేర్లు ఉండటంపై బ్రిటన్‌ పార్లమెంటేరియన్లు, వాణిజ్య నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫోసిస్‌కు యూకేలోని ప్రభుత్వ, ప్రైవేటు కాంట్రాక్టులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యూకేతో జరిగే వాణిజ్య ఒప్పందంలో ఆ కంపెనీకి లబ్ధి చేకూరేలా లబ్ధి చేకూరుతుందనే ఆందోళన వెలిబుచ్చారు. 

తాజాగా బ్రిటన్‌లోని లేబర్‌ పార్టీకి చెందిన నాయకులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రధాని సునాక్‌ సతీమణి అక్షితాకు ఇన్ఫీలో షేర్లు, ఆమెకు లభించే ప్రయోజనాలపై మరింత పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఒప్పందంతో ఇన్ఫోసిస్‌కు ఎటువంటి లబ్ధి లభిస్తుందనే అంశాలపై మరింత స్పష్టంగా వెల్లడించాలని పేర్కొన్నారు. వాణిజ్య చర్చల నుంచి సునాక్‌ వైదొలగాలని సూచించారు. ‘‘ప్రధానిపై ఇటీవల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనకు భారత్‌తో వాణిజ్య ఒప్పందం నుంచి లభించే ప్రయోజనాలు వెల్లడించాలి’’ అని బిజినెస్‌ అండ్‌ ట్రేడ్‌ సెలక్ట్‌ కమిటీ ఛైర్మన్‌, లేబర్‌ పార్టీ నేత డారెన్‌ జోన్స్‌ పేర్కొన్నారు.  

విధేయత ప్రకటిస్తారా.. జైల్లోకి వెళతారా!

తాజా ప్రతిపాదిత ఒప్పందంలో ఐటీ, కృత్రిమ మేధ రంగాల్లోని నిపుణులకు సులువుగా వీసాలు ఇవ్వాలని భారత్‌ పట్టుబడుతోంది. మరో వైపు భారత్‌కు ఎగుమతి చేసే స్కాచ్‌ విస్కీ, కార్లపై పన్నులు తగ్గించాలని బ్రిటన్‌ డిమాండ్‌ చేస్తోంది. అక్షితా మూర్తికి ఛైల్డ్‌ కేర్‌ సంస్థలో ఉన్న వాటాలను సరిగ్గా వెల్లడించలేదని యూకే పార్లమెంట్‌ స్టాండర్డ్స్‌ వాచ్‌డాగ్‌ ఇటీవల వెల్లడించింది. ఈ నేపథ్యంలో రిషి సునాక్‌పై మళ్లీ ఆరోపణలు చెలరేగాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని