Ukraine Crisis: ఈ యుద్ధం మాకు భారీ విషాదాన్ని మిగుల్చుతోంది: రష్యా

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర.. పుతిన్ సేనలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. ఇదే విషయాన్ని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు.

Published : 08 Apr 2022 17:32 IST

మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర.. పుతిన్ సేనలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. ఇదే విషయాన్ని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అంగీకరించారు. తమ సైనికుల మరణాలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘మా దళాలను గణనీయంగా నష్టపోయాం. ఇది మాకు భారీ విషాదం’ అంటూ వ్యాఖ్యానించారు. 

ఉక్రెయిన్‌ను నిస్సైనికీకరణ చేయడం , అక్కడి నాజీ తత్వాన్ని పారదోలడమే తమ లక్ష్యమంటూ ఫిబ్రవరి 24న రష్యా సైనిక చర్యను ప్రారంభించింది. అప్పటినుంచి ఉక్రెయిన్‌పై బాంబు దాడులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో అంతులేని విషాదాలు వెలుగుచూస్తున్నాయి. ఎంతోమంది ప్రజలు తమ సొంత ప్రాంతాలను వదిలి, వలస బాటపట్టారు. అయినా సరే, ఉక్రెయిన్‌ రష్యాను గట్టిగా ప్రతిఘటిస్తోంది. ఈ స్థాయి ప్రతిఘటనను ఊహించని రష్యా భారీ స్థాయిలో సైన్యాన్ని కోల్పోతోంది. ఇప్పటివరకూ ఆ సంఖ్య సుమారు 18 వేల వరకూ ఉండొచ్చని ఉక్రెయిన్ చెప్పగా.. రష్యా చెప్తోన్న సంఖ్య అందుకు ఎన్నో రెట్లు తక్కువగా ఉంది. అయితే భారీ విషాదం అంటూ పుతిన్ ప్రభుత్వం నుంచి వచ్చిన తాజా స్పందన వాస్తవ పరిస్థితిని కళ్లకు కడుతోంది. 

ఉక్రెయిన్‌ నియంత్రణలో సుమీ..

రష్యా సరిహద్దులోని ఉక్రెయిన్‌ నగరం సుమీ తమ ఆధీనంలోనే ఉందని అక్కడి గవర్నర్ వెల్లడించారు. ‘సుమీ ప్రాంతానికి రష్యా సైన్యం బెడద లేదు. అయితే ఈ ప్రాంతం సురక్షితంగా మాత్రం లేదు. ఇక్కడ  పాతిపెట్టిన మైన్స్‌ను తొలగించాల్సి ఉంది’ అంటూ తిరిగిరావాలనుకుంటోన్న ప్రజలను ఉద్దేశించి వెల్లడించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని