China: కరోనాతో షాంఘై విలవిల: లాక్‌డౌన్‌ పొడిగింపు.. 36కి చేరిన మృతులు!

కరోనా వైరస్‌ విజృంభణతో అల్లాడుతోన్న చైనా ఆర్థిక నగరం షాంఘై.. లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించింది.

Published : 22 Apr 2022 22:27 IST

బీజింగ్‌: కరోనా వైరస్‌ విజృంభణతో అల్లాడుతోన్న చైనా ఆర్థిక నగరం షాంఘై.. లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించింది. ఏప్రిల్‌ 26వరకు లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొంది. మరోవైపు గురువారం మరో 11 మంది కొవిడ్‌ బాధితులు మృత్యువాతపడ్డారు. దీంతో షాంఘైలో కొవిడ్‌ మరణాల సంఖ్య 36కి చేరుకుంది.

షాంఘైలో కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ వైరస్‌ ఉద్ధృతి అదుపులోకి రావడం లేదు. నిత్యం దాదాపు 20వేల పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. గురువారం ఒక్కరోజే 17,629 కేసులు రికార్డయ్యాయి. అయితే, అంతకుముందురోజుతో పోలిస్తే కేసుల సంఖ్య 4.7శాతం తక్కువగా నమోదైనట్లు ఆరోగ్య విభాగం వెల్లడించింది. దీంతో మార్చి 1 నుంచి ఇప్పటివరకు నమోదైన మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 4,43,500కు చేరుకున్నట్లు తెలిపింది.

ఇదిలాఉంటే, రెండున్నర కోట్ల జనాభా కలిగిన షాంఘైలో కొవిడ్‌ విజృంభణ నియంత్రణలోకి రావడం లేదు. దీంతో నాలుగో వారం కూడా షాంఘై వాసులు లాక్‌డౌన్‌లోనే కొనసాగాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేస్తోన్న ఆంక్షలపై అక్కడి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆహారం, నిత్యవసర సరుకుల కొరతతో అల్లాడిపోతోన్న షాంఘైవాసులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని