China: షాంఘైలో ఒక్కరోజే 39 కరోనా మరణాలు.. బీజింగ్‌లో హైఅలర్ట్‌

షాంఘైలోనే గడిచిన 24 గంటల్లో 39 మంది కొవిడ్‌ బాధితులు మృత్యువాతపడ్డారు. దీంతో నగరంలో కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 87కు చేరింది.

Published : 25 Apr 2022 02:23 IST

బీజింగ్‌: గడిచిన నెల రోజులుగా కరోనా విజృంభణతో వణికిపోతున్న చైనాలో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. నాలుగు వారాలుగా కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ కరోనా ఉద్ధృతి మాత్రం తగ్గడం లేదు. ఒక్క షాంఘైలోనే గడిచిన 24 గంటల్లో 39 మంది కొవిడ్‌ బాధితులు మృత్యువాతపడ్డారు. దీంతో నగరంలో కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 87కు చేరింది. మరోవైపు రాజధాని బీజింగ్‌లోనూ పదుల సంఖ్యలో పాజిటివ్‌ వెలుగు చూశాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు బీజింగ్‌లో వైరస్‌ కట్టడి చర్యలు ముమ్మరం చేశారు.

బీజింగ్‌లో హై అలర్ట్‌

చైనాలో నిన్న ఒక్కరోజే 21,796 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అక్కడ ఆరోగ్య విభాగం వెల్లడించింది. రాజధాని బీజింగ్‌లోని ఓ పాఠశాలకు చెందిన పదిమంది విద్యార్థులు వైరస్‌ బారినపడ్డారు. దీంతో ఆ పాఠశాలను మూసివేసిన అధికారులు.. ట్రాకింగ్‌ చేపట్టారు. ఒకేసారి పదుల సంఖ్యలో కేసులు బయటపడడంతో పరిస్థితులను సమీక్షించిన ఆరోగ్య అధికారులు, కనిపించకుండా వైరస్‌ వ్యాప్తి మరింత ఎక్కువగా ఉండవచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మే డే సందర్భంగా వారంరోజులు సెలవుదినాలు ఉండడంతో పరిస్థితులు మరింత దారుణంగా మారవచ్చనే అంచనా వేస్తున్నారు. దీంతో వైరస్‌ కట్టడికి కఠిన చర్యలు చేపట్టే పనిలో  అధికారులు నిమగ్నమయ్యారు.

చైనాలో షాంఘై నగరం కాకుండా మరో 16 ప్రావిన్సుల్లో వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోందని అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. జిలిన్‌, హైలాంగ్‌జియాంగ్‌, బీజింగ్‌ నగరాల్లో కరోనా కేసులు బయటపడుతూనే ఉన్నాయన్న అధికారులు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 29,532 మంది కొవిడ్‌ బాధితులు చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు షాంఘైలో కఠిన లాక్‌డౌన్‌ అమలుతో అక్కడి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పలు చోట్ల ఆంక్షలను సడలిస్తోన్న అధికారులు జీరో కొవిడ్‌ వ్యూహాన్ని అమలు కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని