Biden: జో బైడెన్‌ మెడకు చుట్టుకొంటున్న రహస్యపత్రాల గొడవ..!

దేశ రహస్య పత్రాల విషయంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌(Joe Biden) శైలి అనుమానాస్పదంగా ఉన్నట్లు అక్కడి పత్రికలు కథనాలు వెలువరించాయి. ఆయన ఇంట్లో వెతికే కొద్దీ రహస్య పత్రాలు వెలుగు చూస్తున్నాయి. 

Updated : 22 Jan 2023 14:07 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌(Joe Biden)కు ఓ ల్యాప్‌టాప్‌ పెను సమస్యగా మారింది. ఆయన కుమారుడు హంటర్‌ బైడెన్‌ వినియోగించిన ఈ ల్యాప్‌టాప్‌లో సమాచారం విశ్లేషించే కొద్దీ బిత్తరపోయే వాస్తవాలు వెలువడుతున్నాయి. తన వద్ద రహస్య పత్రాలు అత్యంత సురక్షితంగా ఓ సీల్డ్‌ డబ్బాలో ఉన్నాయని బైడెన్‌ ఇటీవల సెలవిచ్చారు. ఆయన ప్రకటన వెలువడిన దాదాపు వారంలోనే న్యూయార్క్‌ పోస్టు పత్రిక సంచలన కథనం వెలువరించింది. అమెరికాకు చెందిన అత్యంత రహస్య పత్రాలు బైడెన్‌ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉన్నట్లు పేర్కొంది. దీనికి తోడు ఆ రహస్యపత్రాలు అక్కడ ఉన్న సమయంలో బైడెన్‌ కుమారుడు హంటర్‌ పలు మార్లు ఆ ఇంటికి వచ్చినట్లు వెల్లడించింది.

* కీలక పత్రాల పెట్టెలుగా భావిస్తున్న ఫొటోలు హంటర్‌ ల్యాప్‌టాప్‌లో లభించడం బలమైన ఆధారంగా నిలిచింది. వీటిల్లో ‘ఇంపార్టెంట్‌ ఫైల్స్‌ + ఫొటోస్‌’ అని రాసి ఉన్న ఓ కార్డ్‌బోర్డ్‌ పెట్టె ఫొటో కూడా ఉంది. గతంలో జోబైడెన్‌(Joe Biden) ‘ప్రామిస్‌ మి, డాడ్‌’ అనే పుస్తకం రాసే సమయంలో శ్వేతసౌధం నుంచి పత్రాలను తీసుకెళ్లినట్లు సమాచారం.

* బైడెన్‌ పాత కార్యాలయంలో నవంబర్‌ 2న కీలక పత్రాలను కనుగొన్నారు. ఆ తర్వాత జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ సిబ్బంది రెండో బ్యాచ్‌ పత్రాలను డెలావేర్‌లోని విల్మింగ్‌టన్‌లో ఉన్న ఇంట్లో గుర్తించారు. వీటిల్లో కొన్ని డెలావేర్‌లోని కార్‌ గ్యారేజీలో బైడెన్‌(Joe Biden)కు చెందిన కొర్వెట్టీ (కారు) వెనుక ఉన్నాయి. ఇవన్నీ ‘సెన్సిటీవ్‌ కంపార్ట్‌మెంటెడ్‌ ఇన్ఫర్మేషన్‌’ కేటగిరికి చెందినవి. దీనిపై ఫాక్స్‌ న్యూస్‌ విలేకరి ఇటీవల ఆయన్ను ప్రశ్నించారు. దానికి బైడెన్‌ స్పందిస్తూ.. నా కొర్వెట్టీ(కారు) లాక్‌చేసిన గ్యారేజీలో ఉంది. అంతేకానీ వీధిలో లేదు అని సమాధానమిచ్చారు. వాస్తవానికి 2020లో జోబైడెన్‌(Joe Biden) ప్రచార బృందం పోస్టు చేసిన ఓ వీడియలో కూడా ఈ కారు పక్కన ఫైల్స్‌ ఉన్న పెట్టె కనిపిస్తోంది.

* 2017 ఫిబ్రవరి 14 నుంచి ఏప్రిల్‌ 6వ తేదీ వరకు హంటర్‌ బైడెన్‌ ఈ ఇంటికి 162 సార్లు వచ్చినట్లున్న అతడి ఐఫోన్‌ ఫ్రీక్వెంట్‌ లోకేషన్‌ స్క్రీన్‌ షాట్‌ను అమెరికా పత్రికలు వెలుగులోకి తెచ్చాయి. అదే సమయంలో అతడు చైనాకు చెందిన కంపెనీతో వివాదాస్పదమైన డీల్స్‌ కుదుర్చుకోవడంపై చర్చలు జరుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

మూడో విడత మరిన్ని పత్రాలు స్వాధీనం..

జోబైడెన్‌(Joe Biden)కు చెందిన విల్మింగ్టన్‌లోని ఇంట్లో జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ తాజాగా సుదీర్ఘ తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా మరిన్ని రహస్య పత్రాలు అక్కడ ఉన్నట్లు గుర్తించింది. వీటిలో బైడెన్‌ సెనెటర్‌గా ఉన్న సమయంలోనివి కొన్ని కాగా.. మరికొన్ని ఆయన ఉపాధ్యక్షుడిగా ఉన్న ఎనిమిదేళ్ల సమయంలోనివిగా గుర్తించారు. ఈ విషయాన్ని బైడెన్‌ వ్యక్తిగత న్యాయవాది ప్రకటించారు. బైడెన్‌ ఇంటికి సంబంధించి తనిఖీలు నిర్వహించేందుకు జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌కు పూర్తిగా అనుమతించారని వెల్లడించారు. 

అధికారులు బైడెన్‌ వ్యక్తిగత ఫైల్స్‌, పేపర్లను 13 గంటల పాటు వెతికారు. వీటిల్లో ఆరు రహస్య పత్రాలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకొన్నారు. వీటితోపాటు బైడెన్‌ చేతితో రాసిన కొన్ని కీలక నోట్స్‌ను కూడా అధికారులు తీసుకెళ్లారు.

అసలు హంటర్‌ ల్యాప్‌టాప్‌ ఎలా బయటకు వచ్చింది..? 

అమెరికా డెలావేర్‌లోని జాన్‌పౌల్‌ మాక్‌ లాసక్‌ అనే వ్యక్తి నిర్వహించే కంప్యూటర్‌ రిపేర్‌ షాప్‌ వద్దకు 2019 ఏప్రిల్‌లో కొన్ని ల్యాప్‌టాప్‌లు మరమ్మతుల కోసం వచ్చాయి. వాటిపై ‘బీయూ బైడెన్‌ ఫౌండేషన్‌’ స్టిక్కర్లు ఉన్నాయి. వాటి నుంచి డేటా వెలికితీయాలని కోరారు. ఆ ల్యాప్‌టాప్‌ల మరమ్మతులు పూర్తి చేసి డేటాను కూడా రికవరీ చేశారు. వాటిని మరమ్మతులకు ఇచ్చిన వ్యక్తి మాత్రం మళ్లీ తిరిగి రాలేదు. సొమ్ము కూడా చెల్లించలేదు. వెలికి తీసిన డేటాలో హంటర్‌ బైడెన్‌ (Hunter Biden) మత్తుమందులు వాడుతున్న ఫొటోలు, ఇతర వీడియో క్లిప్‌లు, మెయిల్స్‌ వంటివి ఉన్నాయి. ఆ ల్యాప్‌టాప్‌ ఇచ్చింది హంటర్‌ బైడెనే(Hunter Biden) అని అర్థం చేసుకొన్న ఆ వ్యక్తి భయపడిపోయాడు. 2019 డిసెంబర్‌లో ఎఫ్‌బీఐ ఆ ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకొంది. అప్పటికే అతడు వాటిలోని సమాచారాన్ని కాపీ చేసి  ట్రంప్‌ సన్నిహితుడు రూడీ గులియాని న్యాయవాది  రాబర్ట్‌ కొస్టెల్లోకు అప్పజెప్పాడు. గులియాని ఈ హార్డ్‌డ్రైవ్‌ను న్యూయార్క్‌ పోస్టుకు ఇచ్చారు. 2020లో న్యూయార్క్ పోస్టు వీటిని పబ్లిష్‌ చేసింది. ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో బైడెన్‌ అధికార దుర్వినియోగం చేశారని ఆరోపించింది. అప్పట్లో ట్విటర్‌(Twitter) ఈ కథనాన్ని సెన్సార్‌ చేయడం కూడా వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు