Published : 30 Mar 2022 14:32 IST

Sri Lanka Crisis: లంక సంక్షోభం తీవ్ర రూపం.. రోజుకు 10 గంటల కరెంట్‌ కట్‌..!

అత్యవసరాలు, నిత్యావసరాలు అన్నీ కొరతే..

కొలంబో: పెట్రోల్‌ నుంచి కూరగాయల దాకా.. నిత్యావసరాల కోసం కిలోమీటర్ల కొద్దీ బారులు.. ఆసుపత్రుల్లో ఔషధాలు లేక అవస్థలు పడుతోన్న రోగులు.. విద్యుద్దీపాలు వెలగక చీకట్లో మగ్గుతున్న ప్రజలు.. ద్వీప దేశం శ్రీలంకలో ఎటు చూసినా కన్పిస్తోన్న దృశ్యాలివే. ఆహార, ఆర్థిక సంక్షోభంతో సింహళ దేళం అల్లాడిపోతోంది. విదేశీ మారక నిల్వలు గణనీయంగా పడిపోవడంతో కీలక దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో అత్యవసరాలు, నిత్యావసరాలు.. ఇలా అన్నింటా కొరత ఏర్పడింది.

ఇంధన కొరత కారణంగా శ్రీలంకలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో సరిపడా విద్యుత్‌ లేక కరెంట్‌ కోతలు మొదలయ్యాయి. తాజాగా ఈ కోతల సమయాన్ని మరింత పెంచుతూ లంక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోజుకు 7 గంటల పాటు కరెంట్‌ సరఫరా నిలిపివేస్తుండగా.. బుధవారం నుంచి దాన్ని 10 గంటలకు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. అంటే దేశవ్యాప్తంగా రోజుకు 10 గంటల పాటు కరెంట్‌ కోతలు ఉండనున్నాయి.

ఇంధనం సరిపడా లేక హైడ్రో ఎలక్ట్రిసిటీ కొరత ఏర్పడింది. భారత్‌ సహకారంతో డీజిల్‌ను దిగుమతి చేసుకుంటున్నప్పటికీ అది అత్యవసర సేవలు, పవర్‌ స్టేషన్లకే సరిపోతుందని శ్రీలంక విద్యుత్‌ శాఖ మంత్రి వెల్లడించారు. విద్యుత్‌ కోతల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో వీధి దీపాలు వెలగక అనేక నగరాలు అంధకారంగా కన్పిస్తున్నాయి. రెస్టారెంట్లు, వీధి వ్యాపారులు క్యాండిల్‌ వెలుతురులో వ్యాపారాలు సాగిస్తున్నారు.

సర్జరీలు వాయిదా..

సంక్షోభం కారణంగా అత్యవసర ఔషధాల నుంచి సిమెంట్‌ వరకూ అన్ని వస్తువుల కొరత ఏర్పడింది. ఆసుపత్రుల్లో మందులు లేక సాధారణ శస్త్రచికిత్సలను వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంది. అటు ఇంధన కొరత కారణంగా రవాణా సదుపాయాలు నిలిచిపోయాయి. పేపర్‌ కొరతతో విద్యా సంస్థలు అన్ని రకాల పరీక్షలను వాయిదా వేశాయి. పెట్రోల్‌తో పాటు కూరగాయాల కోసం కూడా ప్రజలు బారులు తీరాల్సిన స్థితి ఎదురైంది. గంటల తరబడి క్యూలైన్‌లో నిల్చుని కొందరు స్పృహ కోల్పోతుండగా.. ఇప్పటివరకు ముగ్గురు మరణించినట్లు తెలిసింది. ఏడు దశాబ్దాల్లో ఇటువంటి సంక్షోభ పరిస్థితులను చవిచూడలేదని లంకేయులు ఆవేదన వ్యక్తం చేశారు. పలు చోట్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి.

లంకలో ఎందుకీ పరిస్థితి..

పర్యాటక దేశంగా పేరొందిన శ్రీలంకలో 2019లో ఈస్టర్‌ పండగ నాడు ఓ చర్చిలో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటన ఆ దేశ పర్యాటక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. ఆ తర్వాత కరోనా మహమ్మారి ప్రభావంతో పాటు ప్రభుత్వం తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాలు ఆ దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశాయి. విదేశీ మారక నిల్వలు పడిపోవడంతో దిగుమతులపై నిషేధం విధించారు. ఫలితంగా చమురు, నిత్యావసరాల కొరత ఏర్పడి వాటి ధరలు ఆకాశాన్నంటాయి.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని