సోషల్‌ మీడియాపై శ్రీలంక నిషేధం.. వ్యతిరేకిస్తూ ట్వీట్ చేసిన ప్రధాని కుమారుడు

శ్రీలంక ప్రభుత్వం తీసుకున్న సామాజిక మాధ్యమాల నిలుపుదల నిర్ణయాన్ని ఆ దేశ ప్రధాని తనయుడు, క్రీడామంత్రి నమల్ రాజపక్స వ్యతిరేకించారు.......

Updated : 03 Apr 2022 18:05 IST

కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ప్రభుత్వం సోషల్‌ మీడియాపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో వాట్సాప్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ సహా ఇతర సామాజిక మాధ్యమాలు శనివారం-ఆదివారం మధ్యరాత్రి నుంచి నిలిచిపోయాయి. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రధానమంత్రి మహీంద రాజపక్స తనయుడు, యువజన, క్రీడాశాఖ మంత్రి నమల్ రాజపక్స వ్యతిరేకించారు. సామాజిక మాధ్యమాలను నిలిపివేయడాన్ని తాను సమర్థించలేనన్నారు.

‘సోషల్ మీడియాను బ్లాక్ చేయడాన్ని నేను ఎప్పటికీ క్షమించను. వీపీఎన్‌ సాంకేతికతతో సామాజిక మాధ్యమాలను వినియోగించవచ్చు. ఇప్పుడు నేను అదే చేస్తున్నా. ఇలాంటి నిర్ణయాలు నిరుపయోగం. అధికారులు మరింత ప్రగతిశీలంగా ఆలోచించి ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరుతున్నా’ అంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం అక్కడ సామాజిక మాధ్యమాలపై నిషేధం ఉన్నప్పటికీ నమల్ రాజపక్స ఈ ట్వీట్‌ చేయడం గమనార్హం.

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన లంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగుతున్నాయి. ఈ ఆందోళనలను అణచివేయడానికే పాలకులు సోషల్‌ మీడియాను నిలిపివేసినట్టు  తెలుస్తోంది. సంక్షోభ నివారణలో ప్రభుత్వం విఫలమైందంటూ వివిధ ప్రజాసంఘాలు శనివారం పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చాయి. వీటి నియంత్రణకు ఉపక్రమించిన అక్కడి ప్రభుత్వం 36 గంటల అత్యవసర పరిస్థితి విధించింది. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఆ వెంటనే సామాజిక మాధ్యమాలపై కూడా నిషేధం విధించడం గమనార్హం. కొన్ని ప్రాంతాల్లో సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

భారత్ సాయం

సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు భారత ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి శ్రీలంకకు భారత్ 2.5 బిలియన్ డాలర్ల సాయం అందించింది. 1.50 లక్షల టన్నుల ఇంధనాన్ని నాలుగు కంటైనర్లలో శ్రీలంకకు పంపినట్లు భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లే తెలిపారు. మరో ఐదు కంటైనర్లను మే నెలలో అందించనున్నట్లు వెల్లడించారు. ఇంధనం కోసం శ్రీలంకకు 500 మిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చిన భారత్.. ఆహారం, ఔషధాలు, అత్యవసర వస్తువుల కోసం మరో బిలియన్ డాలర్లు అందించాలని గత నెలలోనే నిర్ణయించుకుందని వివరించారు. ఇందులో భాగంగా బియ్యంతో కూడిన కంటైనర్ శ్రీలంకకు త్వరలోనే చేరుకుంటుందని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని