Published : 29 Apr 2022 02:27 IST

Parag Agrawal: ట్విటర్ కొనుగోలు.. తన గురించి ఆలోచించేవారికి పరాగ్ సమాధానాలివే..!

కాలిఫోర్నియా: ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్‌ను టెస్లా సీఈఓ ఎలాన్‌మస్క్‌ కొనుగోలు చేయడంతో అందరి దృష్టి కొద్ది నెలల క్రితం సీఈఓగా నియమితులైన పరాగ్ అగర్వాల్‌పై పడింది. ఆయన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొందరు నెట్టింట్లో తమ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. కానీ పరాగ్ మాత్రం ట్విటర్‌లో తన భవిష్యత్తుపై నమ్మకంతో కనిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇచ్చే సమాధానాలు ఆ వైఖరిని వెల్లడిస్తున్నాయి. 

‘నేను ట్విటర్ ప్రస్తుత సీఈఓ గురించి ఆలోచిస్తున్నాను. సంస్థ కోసం ఆయన ప్రణాళికలు వేసుకున్నారు. కానీ ఇప్పుడు మొత్తం అనిశ్చితి నెలకొని ఉంది’ అంటూ ఓ సుహైల్ అనే నెటిజన్ ట్వీట్ చేశారు. అందుకు పరాగ్ వెంటనే స్పందించారు. తన గురించి ఆలోచించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ‘మీకు కృతజ్ఞతలు. కానీ నా గురించి ఆలోచించొద్దు. ఇక్కడ ముఖ్యమైనది వినియోగదారులకు సరైన సేవలు అందించడమే’ అంటూ తాజా పరిణామంతో సంబంధం లేదన్నట్టుగా స్పందించారు. అలాగే ‘నాట్ పరాగ్ అగర్వాల్‌’ అనే పేరుతో ఉన్న మరో నెటిజన్.. ‘మనందరిని తొలగించారనుకున్నాను’ అంటూ ట్వీట్ చేయగా..‘లేదు, మనం ఇంకా ఇక్కడే ఉన్నాం’ అంటూ సీఈఓ సమాధానమిచ్చారు. అలాగే ఈ క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తోన్న తన బృందం పట్ల గర్వంగా ఉన్నట్లు చెప్పారు.  

ట్విటర్‌ మస్క్‌ సొంతమైందని తెలిసిన తర్వాత.. ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే స్పందించారు. ‘గరిష్ఠ విశ్వసనీయత, కలుపుకొని పోయే విధంగా సంస్థను మార్చాలనుకునే విషయంలో ఎలాన్‌ ఆలోచన సరైంది. పరాగ్ శైలి కూడా ఇదే. అందుకే ఆయన్ను సీఈఓగా ఎంచుకున్నాను. ఈ క్లిష్ట పరిస్థితి నుంచి సంస్థను గట్టెక్కించినందుకు మీ ఇద్దరికి ధన్యవాదాలు. ఇదే సరైన మార్గం’ అని ఈ టేకోవర్‌పై ట్వీట్‌ చేశారు. ఆయన మాటల్లో పరాగ్‌పై విశ్వాసం వ్యక్తం చేశారు. 

ఈ నేపథ్యంలో పరాగ్‌ ట్విటర్‌లో కొనసాగుతారా? అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఒప్పందం పూర్తయిన తర్వాత 12 నెలల్లోపు ఆయన్ను తొలగిస్తే 42 మిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. జాక్‌ డోర్సే స్థానంలో పరాగ్‌ గత ఏడాది నవంబరులో సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆయన 30.4 మిలియన్‌ డాలర్లు పరిహారంగా పొందినట్లు తెలుస్తోంది. అలాగే కంపెనీలో ఆయనకున్న ఇతర గ్రాంట్లు, బోనస్‌లు అన్నీ కలుపుకొని 42 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.321.78 కోట్లు) చెల్లించాల్సి ఉంటుందని అంచనా.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని