Ukraine Crisis: రష్యాకు ఆధునిక ఆయుధాల కొరత?

సైనిక చర్య పేరిట ఉక్రెయిన్‌లో రష్యా భారీ ఎత్తున విధ్వంసానికి పాల్పడుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మాస్కో సేనలు అక్కడి భూతల లక్ష్యాలపై దాడుల కోసం 1960ల నాటి ‘కేహెచ్‌-22’ భారీ యాంటీ-షిప్ మిసైళ్లను...

Published : 12 Jun 2022 01:47 IST

ఉక్రెయిన్‌ భూతల లక్ష్యాలపై 1960ల నాటి క్షిపణుల ప్రయోగం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: సైనిక చర్య పేరిట ఉక్రెయిన్‌లో రష్యా భారీ ఎత్తున విధ్వంసానికి పాల్పడుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మాస్కో సేనలు అక్కడి భూతల లక్ష్యాలపై దాడుల కోసం 1960ల నాటి ‘కేహెచ్‌-22’ భారీ యాంటీ-షిప్ మిసైళ్లను ప్రయోగిస్తున్నాయని బ్రిటన్‌ రక్షణశాఖ తన తాజా ఇంటెలిజెన్స్ నివేదికలో తెలిపింది. అణు వార్‌హెడ్‌లతో కూడిన ఈ సంప్రదాయ క్షిపణులు వాస్తవంగా యుద్ధ విమాన వాహక నౌకలను ధ్వంసం చేసేందుకు వీలుగా రూపొందించినవి. ఒక్కోటి 5.5 టన్నుల బరువు ఉంటుంది. ‘ఏప్రిల్‌ నుంచి రష్యా డజన్ల కొద్ది.. కేహెచ్‌-22 మిసైళ్లను ప్రయోగించి ఉండొచ్చు. కానీ, నౌకలపై దాడుల కోసం ఉద్దేశించిన ఈ క్షిపణులను భూభాగంపై ఉపయోగించడం సరికాదు. వాటికి కచ్చితత్వం ఉండదు. ఫలితంగా తీవ్ర ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లుతుంది’ అని పేర్కొంది.

కచ్చితత్వంతోకూడిన ఆధునిక క్షిపణుల కొరత కారణంగానే రష్యా ఇలాంటి పనికిరాని ఆయుధాలను ఉపయోగిస్తోందని బ్రిటన్ రక్షణ శాఖ అభిప్రాయపడింది. అయితే, ఈ క్షిపణులను ఎక్కడ ప్రయోగించిందో వివరాలు ఇవ్వలేదు. ఉక్రెయిన్‌ వైమానిక రక్షణ వ్యవస్థలు ఇప్పటికీ రష్యా వాయుసేన దాడులను అడ్డుకుంటున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా.. డాన్‌బాస్‌లోని సీవీరోదొనెట్స్క్‌పై పట్టు కోసం ఇరు పక్షాల మధ్య హోరాహోరి పోరు సాగుతోందనీ బ్రిటన్‌ తన నివేదికలో వెల్లడించింది. శుక్రవారం నాటికి రష్యన్ బలగాలు నగరంలోని దక్షిణ దిశగా పురోగతి సాధించలేకపోయాయని చెప్పింది. పుతిన్‌ బలగాలు.. ఫిరంగి దళాలు, వైమానిక సామర్థ్యాలతో ఉక్రెయిన్‌ను అణచివేసేందుకు యత్నిస్తున్నాయని పేర్కొంది. మరోవైపు.. తూర్పు దొనెట్స్క్‌లోని స్లోవియాన్స్క్‌ నగరంపైనా దాడులకు మాస్కో సన్నద్ధమవుతోందని ఉక్రెయిన్‌ ఆర్మీ తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని