UkraineCrisis: సగానికి పతనమైన ఉక్రెయిన్‌ ఆర్థిక వ్యవస్థ..!

రష్యా దాడులతో ఉక్రెయిన్‌ ఆర్థిక వ్యవస్థ దాదాపు 45శాతం పతనమైందని ప్రపంచ బ్యాంక్‌ నివేదిక ఇచ్చింది. మరోపక్క రష్యా కూడా జీడీపీలో దాదాపు 10శాతం

Published : 11 Apr 2022 11:17 IST

 ప్రపంచ బ్యాంక్‌ అంచనా

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా దాడులతో ఉక్రెయిన్‌ ఆర్థిక వ్యవస్థ దాదాపు 45శాతం పతనమైందని ప్రపంచ బ్యాంక్‌ నివేదిక ఇచ్చింది. మరోపక్క రష్యా కూడా జీడీపీలో దాదాపు 10శాతం కోల్పోయిందని ఆ నివేదికలో వెల్లడించింది. ఈ యుద్ధ ప్రభావం రష్యా, ఉక్రెయిన్‌ పొరుగు దేశాలపై కూడా తీవ్రంగానే ఉందని పేర్కొంది. యుద్ధానికి ముందు ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధి రేటు 3శాతం ఉండొచ్చని అంచనాగట్టింది. కానీ, యుద్ధం దెబ్బకు వృద్ధిలేకపోగా.. 4.1శాతం తగ్గే అవకాశం ఉందని లెక్కలు చెబుతున్నాయని వివరించింది. ఇది కొవిడ్‌ మహమ్మారి విజృంభణ ప్రారంభంలో పతనమైనదాని కంటే రెండింతలు. బెలారస్‌, కిర్గిస్థాన్‌,మాల్డోవా,తజకిస్థాన్‌లలో ఈ సారి ఆర్థిక మాంద్యం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 

తూర్పు ఐరోపాలోని చాలా దేశాలు రష్యాకు ఎగుమతులు చేస్తాయి. అంతేకాదు మధ్య ఆసియాలోని చాలా ఆర్థిక వ్యవస్థలకు రెమిటెన్సెస్‌ రూపంలో రష్యా నుంచి నిధులు వెళుతుంటాయి. ‘‘ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఉక్రెయిన్‌ వాసులను ఆదుకొనేలా ప్రభుత్వం నడవాలంటే.. ఆదేశానికి తక్షణమే  భారీ ఆర్థిక సాయం అవసరం’’ అని ప్రపంచ బ్యాంక్‌ ఐరోపా, మధ్య ఆసియా ప్రాంతాలకు ఉపాధ్యక్షురాలు అన్నా బెజ్రెడ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ యుద్ధం కారణంగా ప్రపంచంలో పలు ప్రాంతాలకు ఆహార సరఫరాలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఈ సమస్య ఉక్రెయిన్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్రంగా ఉంది. దీంతోపాటు రష్యా, ఉక్రెయిన్‌ నుంచి వచ్చే గోధుమలపై ఆధారపడ్డ మధ్య ఆసియా దేశాల్లో పరిస్థితి కూడా ఇబ్బందికరంగానే ఉందని ప్రపంచ బ్యాంక్‌ నివేదిక వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని