Zelensky: మీరు చేస్తోన్న సాయం గురించి మా పుస్తకాల్లో రాసుకుంటాం..!

రష్యాను ఎదుర్కోవడంలో ఆస్ట్రేలియా చేస్తోన్న సహాయం ఉక్రెయిన్ చరిత్రలో నిలిచిపోతుందని ఆ దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ అన్నారు. అయితే పుతిన్ సేనలు చేస్తోన్న దురాక్రమణను అడ్డుకునేందుకు మరింత సాయం కావాలని అభ్యర్థించారు.

Published : 04 May 2022 02:26 IST

కీవ్‌: రష్యాను ఎదుర్కోవడంలో ఆస్ట్రేలియా చేస్తోన్న సహాయం ఉక్రెయిన్ చరిత్రలో నిలిచిపోతుందని ఆ దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ అన్నారు. అయితే పుతిన్ సేనలు చేస్తోన్న దురాక్రమణను అడ్డుకునేందుకు మరింత సాయం కావాలని అభ్యర్థించారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా పలు విషయాలు వెల్లడించారు. ఈ యుద్ధ సమయంలో చూసిన భయానక దృశ్యాలు, ఐరోపాకు పొంచి ఉన్న అణు ప్రమాదం గురించి మాట్లాడారు. వారం రోజుల్లో ముగించుకువద్దామని రష్యా దాడిని ప్రారంభించిందని, ఇన్ని రోజులుగా దానిని ఎదిరించి నిలిచేందుకు తమకు అందుతోన్న సహాయం గురించి ప్రస్తావించారు. 

‘ఆస్ట్రేలియా ప్రజల విషయంలో మేం కృతజ్ఞతతో ఉండాలి. ఇప్పటికే మీరు మాకు సహాయం చేశారు. అది నిజం. కానీ మాకు మీ సహాయం ఇంకా కావాలి. అది కూడా నిజం. నన్ను క్షమించండి. యుద్ధంలో పోరాడుతోన్న దేశానికి నేను అధ్యక్షుడిని. నా ఆవేదనను మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఉక్రెయిన్ మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. మీరు అందించిన సహకారం మా చరిత్ర పుస్తకాల్లో రాసుకుంటాం’ అంటూ కృతజ్ఞతలు తెలియజేశారు. 

రష్యా పాల్పడుతోన్న యుద్ధ నేరాలు తనను తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయని జెలెన్‌స్కీ అన్నారు. ‘సామాన్య ప్రజలపై జరుగుతోన్న దాడులు చూస్తుంటే.. బాధ, కోపం కలిగింది. ప్రతికారం తీర్చుకోవాలనిపించింది. అంత మానవత్వం లేకుండా ఎలా ప్రవర్తిస్తున్నారనిపించింది. మీరు మీ మానవత్వాన్ని కోల్పోయినా, నేను దానిని వదులుకోదల్చుకోలేదు. ఈ విధమైన బలహీనత గురించి చెప్పడానికి భయపడదల్చుకోలేదు. అందుకే నేను అన్నింటిని చూస్తున్నాను. యుద్ధాన్ని జీవితంలో భాగంగా చేసుకోవడం.. ఒక చెత్త అలవాటు. ఈ యుద్ధంలో నా ప్రజలు, సైనికులు పోరాడుతున్నారు. ఎన్నో బాధలు పడుతున్నారు’ అంటూ రష్యాపై విరుచుకుపడ్డారు. ఇలా దూకుడుగా వ్యవహరిస్తోన్న రష్యా.. చెర్నోబిల్ ప్రాంతంలో అణ్వాయుధాలను ఉపయోగించదని తామేమీ ఆశించడం లేదన్నారు. 

11 లక్షల మంది ఉక్రెయిన్‌ వాసులు రష్యాకు...

‘రష్యా బలవంతంగా 11 లక్షల మంది ఉక్రెయిన్ ప్రజలను తన దేశానికి తరలించింది. వారిలో రెండు లక్షల మంది చిన్నారులున్నారు. రష్యా ఆక్రమిత ప్రాంతమైన డాన్‌బాస్‌ నుంచి వారిని తరలించింది’ అంటూ ఉక్రెయిన్ వార్తా సంస్థ ట్వీట్ చేసింది. సోమవారం 11,500 మందిని తరలించగా.. వారిలో 1,847 మంది పిల్లలున్నారని పేర్కొంది. అయితే ఆ ప్రజల అభ్యర్థన మేరకే వారిని తరలించామని రష్యా చెప్తోంది. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని