Ukraine Tragedy: అమ్మా.. మళ్లీ మనం స్వర్గంలో కలుద్దాం..!

రష్యా దాడిలో చనిపోయిన తల్లిని స్మరించుకుంటూ ఓ తొమ్మిదేళ్ల చిన్నారి భావోద్వేగంతో రాసిన లేఖ ప్రతిఒక్కరినీ కలచివేస్తోంది.

Published : 11 Apr 2022 02:11 IST

కంటతడి పెట్టిస్తోన్న తొమ్మిదేళ్ల చిన్నారి లేఖ

కీవ్‌: రష్యా సైన్యం భీకర దాడులతో వణికిపోతోన్న ఉక్రెయిన్‌లో దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. బుచా వంటి నగరాల్లో నగరాల్లో రష్యా సైనికులు ఆకృత్యాలు యావత్‌ ప్రపంచాన్ని నిశ్చేష్టులను చేస్తున్నాయి. ఈ క్రమంలో సైన్యం దాడుల్లో తల్లిదండ్రులను కోల్పోతున్న చిన్నారులు ఆవేదన వర్ణనాతీతం. బొరొడియెంక నగరంలో ఇటువంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. రష్యా దాడిలో చనిపోయిన తల్లిని స్మరించుకుంటూ ఓ తొమ్మిదేళ్ల చిన్నారి భావోద్వేగంతో రాసిన లేఖ ప్రతిఒక్కరినీ కలచివేస్తోంది. అమ్మ చెప్పినట్లుగా ఓ మంచి అమ్మాయిగా పేరుతెచ్చుకుంటానని.. తద్వారా మళ్లీ తనను స్వర్గంలో కలుసుకోవచ్చంటూ రాసిన లేఖ ప్రతిఒక్కరినీ కదిలిస్తోంది.

‘అమ్మా.. మార్చి 8న రాస్తున్న ఈ లేఖ నీకు అంకితం. తొమ్మిదేళ్లు నా జీవితంలో మరచిపోలేని రోజులు ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా బాల్యంలో నీవు ఉన్నందుకు ఎంతో కృతజ్ఞురాలిని. ప్రపంచంలో బెస్ట్‌ అమ్మవు నీవే. నిన్నెప్పటికీ మరచిపోను. ఆకాశంలో నీవు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. నీవు స్వర్గానికి వెళ్లాలని ఆకాంక్షిస్తున్నా. మళ్లీ మనం స్వర్గంలో కలుద్దాం. నేను కూడా అక్కడకు (స్వర్గానికి) రావడానికి మంచి అమ్మాయిగా పేరు తెచ్చుకుంటా. అందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తా. కిస్‌ యూ అమ్మా..’ అంటూ తొమ్మిదేళ్ల చిన్నారి తన డైరీలో రాసుకుంది. ఈ చిన్నారి రాసుకున్న లేఖను ఉక్రెయిన్‌ అంతర్గత వ్యవహారాల శాఖ సలహాదారుడు ఆంటోన్‌ గెరషెంకో ట్విటర్‌లో షేర్‌ చేశారు.

ఇదిలాఉంటే, ఉక్రెయిన్‌లో సామాన్యులపై కనికరం లేకుండా రష్యా సేనలు చేస్తోన్న దాడులకు ఎంతోమంది మహిళలు, చిన్నారులు, వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా బొరొడియెంక నగరంలో కారులో ప్రయాణిస్తోన్న ఓ కుటుంబంపై రష్యా సేనలు దాడి జరిపాయి. ఆ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. అనంతరం ఆమెను గుర్తు చేసుకుంటూ తొమ్మిదేళ్ల కూతురు గలియా తన డైరీలో రాసుకున్న లేఖ ప్రతిఒక్కరినీ కదిలిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని