Ukraine Crisis: ‘శత్రువు మమ్మల్ని చుట్టుముట్టింది.. ఇదే మా ఆఖరి పోరాటం కావొచ్చు..’!

రష్యా చేతుల్లో ఉండిపోయిన మేరియుపొల్‌ నగరాన్ని తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఉక్రెయిన్ సేనలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈ ప్రయత్నంలో భాగంగా ‘చివరిపోరు’కు సిద్ధమవుతున్నట్లు 36వ మెరైన్ బ్రిగేడ్ ఫేస్‌బుక్ వేదికగా ప్రకటించింది.

Published : 12 Apr 2022 01:21 IST

కీవ్‌: రష్యా చేతుల్లో తీవ్ర విధ్వంసానికి గురైన మేరియుపొల్‌ నగరాన్ని తిరిగి తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ఉక్రెయిన్ సేనలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈ ప్రయత్నంలో భాగంగా ‘ఆఖరి పోరు’కు సిద్ధమవుతున్నట్టు 36వ మెరైన్ బ్రిగేడ్ ఫేస్‌బుక్ వేదికగా ప్రకటించింది. చుట్టుముట్టిన రష్యన్ సేనల ముందు నెగ్గలేమని తెలిసినా.. తమ ప్రయత్నాన్ని మాత్రం కొనసాగించనున్నట్లు తెలిపింది. 

‘‘పోరాటం చేయడానికి కావాల్సిన ఆయుధాలు నిండుకుంటున్నాయి. ఇక ఇదే మా చివరి పోరాటం కావొచ్చు. మాలో కొందరు మరణించవచ్చు. మరికొందరు బందీలు కావొచ్చు’ అంటూ ఫలితం తెలిసినా.. వీరోచితంగా ముందుకు వెళ్లేందుకే సిద్ధమైంది. ‘గత 47 రోజులుగా ఈ నగరాన్ని రక్షించుకోవడానికి సాధ్యమైనంత చేశాం. కానీ శత్రువు మమ్మల్ని క్రమంగా వెనక్కి నెట్టింది. బాంబులతో మమ్మల్ని చుట్టుముట్టింది. చివరకు మమ్మల్ని ధ్వంసం చేయడానికి సిద్ధమైంది. మా బ్రిగేడ్‌లో సగం మంది గాయాలపాలయ్యారు. చాలామంది మరణించడంతో ఉన్నవాళ్లతో సిద్ధమవుతున్నాం’ అంటూ వెల్లడించింది. అయితే తమకు ఉక్రెయిన్ సైనికాధికారుల నుంచి కమ్యూనికేషన్ లేదని ఫిర్యాదు చేసింది.

రష్యా దురాక్రమణ ప్రారంభమైనప్పట్నుంచి మేరియుపొల్‌ తీవ్రంగా ధ్వంసం అవుతోంది. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఆ ప్రాంతం నుంచి రష్యా సేనలు వీడిన తర్వాత ఎలాంటి దృశ్యాలు చూడాల్సి వస్తుందోనని ఉక్రెయిన్ నాయకత్వం తీవ్ర ఆందోళనతో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని