China: మైనార్టీలపై చైనా క్రూరత్వం.. ఐరాస సంచలన నివేదిక

ఉగ్రవాద నిర్మూలన పేరుతో చైనా తమ దేశంలోని మైనార్టీలపై మారణహోమానికి పాల్పడుదోందన్న అంతర్జాతీయ సమాజం ఆందోళన నిజమేనని

Updated : 01 Sep 2022 12:34 IST

జెనీవా: ఉగ్రవాద నిర్మూలన పేరిట చైనా తమ దేశంలోని మైనార్టీలపై మారణహోమానికి పాల్పడుతోందన్న అంతర్జాతీయ సమాజం ఆందోళన నిజమేనని తేలింది. షిన్‌జియాంగ్‌ ప్రాంతంలో వీగర్‌ ముస్లింలు, ఇతర మైనార్టీలపై చైనా హింసకు పాల్పడుతోందన్న ఆరోపణలు నమ్మదగినవేనని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం నివేదిక వెల్లడించింది. అక్కడ మనుషులపై దారుణమైన నేరాలు జరిగి ఉండొచ్చని అభిప్రాయపడింది. ఈ మేరకు బుధవారం సంచలన నివేదికను బయటపెట్టింది.

నిర్బంధ శిబిరాల్లో దారుణాలు..

షిన్‌జియాంగ్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు, మైనార్టీలపై హింసాకాండపై జర్నలిస్టులు, స్వతంత్ర సలహా బృందాలు జరిపిన పరిశోధనల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. చైనాలోని పశ్చిమ షిన్‌జియాంగ్‌ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా 10లక్షల మందికి పైగా వీగర్లు, ఇతర ముస్లిం మైనార్టీలను డ్రాగన్‌ సర్కారు నిర్బంధ శిబిరాలకు తరలించింది. అవి కేవలం వృత్తి విద్యా శిక్షణా కేంద్రాలు మాత్రమే అని, అతివాదం, తీవ్రవాదాన్ని అరికట్టేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు చైనా చెబుతోంది. కానీ, అవి క్రూరమైన నిర్బంధ కేంద్రాలని అక్కడి నుంచి బయటికొచ్చిన వారు చెప్పడం గమనార్హం. దీంతో అక్కడి మైనార్టీల భద్రతపై పశ్చిమ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఉగ్రవాద నిర్మూలన పేరుతో చైనా నరమేధానికి పాల్పడుతోందని అమెరికా, సహా పలు దేశాలు ఆరోపించాయి.

ఈ క్రమంలోనే పలు పరిశోధనలు జరిపిన అనంతరం ఐరాస మానవహక్కుల సంఘం తాజా నివేదిక విడుదల చేసింది. ఆ కేంద్రాల్లో బందీలుగా ఉన్నవారితో అధికారులు అత్యంత పాశవికంగా ప్రవర్తించడం, బలవంతంగా వైద్య చికిత్సలు చేయించడం వంటివి నిజమేనని నివేదిక తెలిపింది. కొందరిపై లైంగికపరమైన హింస కూడా జరిగినట్లు తెలిసిందని పేర్కొంది. దీనిపై అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని ఐరాస అభిప్రాయపడింది. అయితే, అక్కడ మారణహోమం జరిగిందన్న పశ్చిమ దేశాల వాదనను ఈ నివేదికలో ఎక్కడా ప్రస్తావించలేదు.

చైనా ఏమంటోంది..

ఐరాస మానవహక్కుల చీఫ్‌ మిషెల్లీ బచెలెట్‌ ఆగస్టు 31న తన పదవి నుంచి దిగిపోయారు. పదవీకాలం ముగియటానికి కేవలం 13 నిమిషాల ముందు ఆమె ఈ నివేదికను విడుదల చేయడం గమనార్హం. నిజానికి ఈ నివేదిక ఎప్పుడో పూర్తయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. ఈ నివేదిక విడుదలను అడ్డుకొనేందుకు డ్రాగన్‌ నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురైంది. కానీ, షిన్‌జియాంగ్‌లో జరుగుతోన్న దారుణాలు అంతర్జాతీయ సమాజం దృష్టికి తేవాలనే ఉద్దేశంతో ఈ నివేదికను విడుదల చేశానని మిషెల్లీ వెల్లడించారు. అయితే, ఎప్పటిలాగే ఈ నివేదికలోని అంశాలను చైనా ఖండించింది. షిన్‌జియాంగ్‌ వివాదం పూర్తిగా కల్పితమేనని, రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఐరాసపై చైనా రాయబారి జాంగ్ జున్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా వృద్ధికి ఆటంకం కలిగించేందుకు.. తమ ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకే పశ్చిమ దేశాలు చేస్తోన్న ప్రయత్నాలని దుయ్యబట్టారు. ఈ నివేదికను తాము ఇప్పటి వరకు చూడలేదని, కానీ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తగదని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని