USA Drone: రష్యాదే తప్పు.. ఇదిగో సాక్ష్యం: అమెరికా

నల్లసముద్రం (Black sea)లో అమెరికాకు చెందిన నిఘా డ్రోన్‌ (Drone) కూలిపోవడంపై అమెరికా,రష్యాల మధ్య ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. రష్యాదే తప్పు అని నిరూపించేందుకు గానూ ఘటనకు సంబంధించిన వీడియోను అమెరికా విడుదల చేసింది.

Updated : 16 Mar 2023 20:24 IST

వాషింగ్టన్‌: నల్లసముద్రం (Black sea)లో అమెరికా (USA) నిఘా డ్రోన్‌ (Drone) కూల్చివేత ఘటనపై ఇరుదేశాలూ వెనక్కి తగ్గడం లేదు. తప్పు మీదంటే మీదని పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. ఈ ఘటనకు సంబంధించి అమెరికా తాజాగా ఓ వీడియోను విడుదల చేసింది. వేగంగా దూసుకెళ్తున్న ఫైటర్‌ జెట్‌.. ఒక్కసారిగా ఇంధనాన్ని వెళ్లగక్కుతున్నట్లు అందులో కనిపిస్తోంది. ఈ మేరకు అమెరికా యూరోపియన్‌ కమాండ్‌ తన అధికారిక ట్విటర్‌లో పోస్టు చేసింది. ‘‘ రష్యాకు చెందిన ఎస్‌యూ-27 జెట్‌ విమానం.. అమెరికా సైన్యానికి చెందిన ఎంక్యూ-9పై ఇంధనం చల్లింది. అక్కడికి సెకెన్ల వ్యవధిలోనే మరో రష్యన్‌ జెట్ మళ్లీ ఇంధనాన్ని డ్రోన్‌ మీదకి చల్లింది. ఆ తర్వాత నేరుగా ప్రొఫెల్లర్‌ను ఢీ కొట్టింది. దీంతో నిఘా డ్రోన్‌ కూలిపోయింది.’’ అని యూఎస్‌ యూరోపియన్‌ కమాండ్‌ రాసుకొచ్చింది.

మరోవైపు అమెరికా నిఘా డ్రోన్‌పై రష్యా కావాలనే ఇంధనం చల్లి, ఆ తర్వాత ఢీ కొట్టిందని అమెరికా మిలటరీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది రష్యా నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని మండిపడింది. ‘‘డ్రోన్‌ను ఢీ కొట్టడానికి ముందు రష్యాకు చెందిన ఎస్‌యూ- 27 అనేక సార్లు ఇంధనాన్ని చల్లింది. ఎంక్యూ-9కి అతి సమీపం నుంచి ప్రయాణించింది. వాతావరణంలోకి ఇంధనాన్ని విడుదల చేస్తూ పర్యావరణానికి హాని కలిగేలా ప్రవర్తిస్తూ రష్యా.. అనైతిక చర్యలకు పాల్పడింది.’’ అని అమెరికా మిలటరీ ఆరోపించింది. అయితే, అమెరికా ఆరోపణలను రష్యా ఖండించింది. అమెరికా నిఘా డ్రోన్‌ ఎంక్యూ 9 నియంత్రణ కోల్పోయి ఎస్‌యూ-27 జెట్‌ ప్రయాణిస్తున్న మార్గంలోకి చొచ్చుకొచ్చిందని, జెట్‌ను ఢీ కొట్టి సముద్రంలో కూలిపోయిందని వివరణ ఇచ్చింది. ఈ మేరకు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా ఈ ఘటనలో రష్యా ఎలాంటి ఆయుధాలను ఉపయోగించలేదని స్పష్టం చేసింది.

మంగళవారం నల్ల సముద్రం ఉపరితల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై ఇరుదేశాలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నాయి. దీన్ని కవ్వింపు చర్యగా మాస్కో అభివర్ణించింది. అగ్రరాజ్యం మాత్రం అమెరికా ఆస్తులకు దగ్గరగా ఎగురుతున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. యూఎస్‌లోని రష్యా రాయబారి అనతోలి ఆంటనోవ్‌ను అమెరికా పిలిపించి మాట్లాడింది. తమ దేశ ఆస్తులకు సమీప గగనతలంలో ఎగురుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు మాస్కోలో రష్యా అధికారులు కూడా నేరుగా అమెరికాపై గురిపెట్టారు. ‘‘సైనిక అంశాల్లో మేం పాలుపంచుకోవడం లేదని అమెరికన్లు చెబుతున్నారు. కానీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారన్నదానికి ఈ డ్రోన్‌ సంఘటనే నిదర్శనం’’ అని ఓ ప్రతినిధి తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు