Ukraine Crisis: ఆ వ్యాధికారక క్రిముల్ని వెంటనే నాశనం చేయండి..!

దేశంలో పలు ప్రయోగశాలలలో ఉన్న అధికముప్పు గల వ్యాధికారక క్రిములను నాశనం చేయాలని ఉక్రెయిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.

Published : 11 Mar 2022 12:01 IST

ఉక్రెయిన్‌కు సూచించిన ఆరోగ్య సంస్థ

జెనీవా: దేశంలో పలు ప్రయోగశాలలలో ఉన్న అధికముప్పు గల వ్యాధికారక క్రిములను నాశనం చేయాలని ఉక్రెయిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లో రష్యా బాంబుల వర్షం కురిపిస్తోన్న తరుణంలో ఈ సూచన చేసింది. ఈ దాడులతో ల్యాబ్‌లు ధ్వంసమై ఆ వ్యాధికారక క్రిములు వ్యాప్తి చెందే అవకాశం ఉందని, ఆ ఉపద్రవాన్ని నిరోధించేందుకే ఈ హెచ్చరిక చేసింది. 

మానవాళి, జంతుజాలంపై ఈ క్రిములు కలిగించే ప్రభావాన్ని తగ్గించే దిశగా ఈ ప్రయోగశాలల్లో పరిశోధనలు జరుపుతారు. ఇతర దేశాల మాదిరిగానే ఉక్రెయిన్ కూడా వీటిని నిర్వహిస్తోంది. వీటికి అమెరికా, ఐరోపా, ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతు ఉంది. రష్యా రెండు వారాలుగా ఈ దేశంపై దాడులు జరుపుతుండటంతో ఈ ప్రయోగశాలల భద్రతపై ఆందోళన మొదలైంది. 

కాగా, ఈ ల్యాబ్‌లను ఉద్దేశించి రష్యా వాదనలు వేరుగా ఉన్నాయి. ఉక్రెయిన్‌లో అమెరికా బయోవార్‌ఫేర్ ల్యాబ్‌ను నిర్వహిస్తోందని ఆరోపించింది. యుద్ధ సమయంలో పుతిన్ ప్రభుత్వం తరచూ వాటిపై ఆరోపణలు చేసింది. ఆ ల్యాబ్‌కు చెందిన ఆధారాలను నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తమకు దొరికిన పత్రాలు బట్టి వెల్లడవుతోందని నిందించింది. కాగా, అమెరికా, ఉక్రెయిన్‌ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. రష్యా తన జీవాయుధాలను మోహరించేందుకు ఈ వాదనను సాకుగా చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా స్పందించారు. తానో తండ్రినని, తమ గడ్డపై అలాంటి ఆయుధాలు ఎన్నటికీ తయారుచేయబోమని స్పష్టంగా చెప్పారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని