Published : 29 May 2022 01:28 IST

UN: విపత్తుల నివారణకు చాలా తక్కువ ఖర్చు చేస్తున్నారు.. ఐరాస ఏజెన్సీ ఆక్షేపణ!

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణాఫ్రికాలో వరదల నుంచి భారత్‌లో తీవ్ర వడగాలుల వరకు.. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులు పెరుగుతున్నాయని యూఎన్‌ ఆఫీస్‌ ఫర్‌ డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ హెడ్‌ మామి మిజుటోరి ఆందోళన వ్యక్తంచేశారు. అయితే, వాటిని నివారించేందుకు మాత్రం ప్రపంచ దేశాలు చాలా తక్కువ ఖర్చు చేస్తున్నాయని ఆక్షేపించారు. ప్రకృతి వైపరీత్యాల ముప్పు తగ్గింపు అంశంపై తాజాగా బాలిలో ఏర్పాటు చేసిన గ్లోబల్ ఫోరమ్‌కు ముందు మిజుటోరి మాట్లాడారు. 2010 నుంచి 2019 వరకు అందుబాటులో ఉన్న 133 బిలియన్‌ డాలర్ల విపత్తు బడ్జెట్‌లో.. కేవలం నాలుగు శాతం మాత్రమే వైపరీత్యాల నివారణకు ఖర్చు చేశాయని, మిగతాదంతా తదనంతర చర్యలకే పెట్టాయన్నారు.

‘ప్రస్తుతం మనం ప్రమాదాల ప్రపంచంలో జీవిస్తున్నాం. ఈ నేపథ్యంలో విపత్తుల నివారణకు మరిన్ని పెట్టుబడులు పెట్టాలి’ అని మిజుటోరి పిలుపునిచ్చారు. ‘ప్రపంచ దేశాలు.. ప్రకృతి వైపరీత్యాలు, భౌగోళిక- రాజకీయ సంఘర్షణలతో పోరాడుతోన్న సమయంలో ఈ నిధుల కొరత ఏర్పడింది. అయితే, విపత్తుల కారణంగా అభివృద్ధి చెందుతోన్న దేశాలే ఎక్కువగా నష్టపోతున్నాయి. అవి ఏటా తమ స్థూల జాతీయోత్పత్తిలో ఒక శాతం కోల్పోతున్నాయి. దీంతో కష్టపడి సాధించిన ఆర్థిక ప్రగతి ప్రమాదంలో పడుతోంది. అదే అభివృద్ధి చెందిన దేశాల విషయంలో ఈ నష్టం 0.1- 0.3 శాతానికి పరిమితమైంది’ అని చెప్పారు. ఈ క్రమంలోనే విపత్తుల నివారణతోపాటు మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం మరిన్ని నిధుల సమీకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని