Mauna Loa: ప్రపంచంలోనే అతిపెద్ద క్రియాశీల అగ్నిపర్వతం.. లావాతో బుసలు!

ప్రపంచంలోనే అతి పెద్ద క్రియాశీల అగ్నిపర్వతం ‘మౌనా లోవా(Mauna Loa)’ మరోసారి పేలనుందా! పసిఫిక్‌ మహాసముద్రంలోని హవాయి(Hawaii) ద్వీపంలో ఉన్న ఈ అగ్నిపర్వతం తాజాగా పెద్దఎత్తున లావా ఎగజిమ్ముతోంది.

Published : 29 Nov 2022 20:35 IST

హానలులు: ప్రపంచంలోనే అతి పెద్ద క్రియాశీల అగ్నిపర్వతం ‘మౌనా లోవా(Mauna Loa)’ మరోసారి పేలనుందా! పసిఫిక్‌ మహాసముద్రంలోని హవాయి(Hawaii) ద్వీపంలో ఉన్న ఈ అగ్నిపర్వతం తాజాగా పెద్దఎత్తున లావా ఎగజిమ్ముతోంది. 1984 తర్వాత దీన్నుంచి లావా వెలువడటం ఇదే మొదటిసారి. దీంతో అగ్నిపర్వత బిలం.. ఎర్రటి లావా ప్రవాహాలు, బూడిద, పొగతో నిండిపోయింది. ఈ ప్రాంతంలో అనేక స్వల్ప భూకంపాలు, ప్రకంపనలు నమోదవుతోన్న నేపథ్యంలో.. అగ్నిపర్వతం బద్ధలయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు.

ఊబికివస్తోన్న లావా ప్రస్తుతానికి బిలం వరకే పరిమితమైన నేపథ్యంలో.. ఇప్పట్లో పరిసర ప్రాంతవాసులకు ఎటువంటి ముప్పు లేదని అమెరికా జియలాజికల్ సర్వీస్‌(యూఎస్‌జీఎస్‌) వెల్లడించింది. అయితే, పరిస్థితులు వేగంగా మారొచ్చని హెచ్చరించింది. ప్రస్తుతానికి.. అగ్నిపర్వత వాయువులు, బూడిద నివాస ప్రాంతాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ముందుజాగ్రత్త చర్యగా స్థానిక అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. ‘మౌనా లోవా’ చివరిసారి 1984లో విస్ఫోటం చెందింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని