
తాజా వార్తలు
చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
ఇంటర్నెట్డెస్క్: ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు ఎదురీదుతోంది. ఆటగాళ్లకు గాయాలు.. సీనియర్ల గైర్హాజరీ.. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు వంటి ప్రతికూలతల్లోనూ టీమిండియా అద్వితీయంగా పోరాడుతోంది. టెస్టు సిరీస్ను సాధించాలన్న కసితో ఆడుతోంది. అయితే, నిర్ణయాత్మక చివరి టెస్టు అంతిమ ఘట్టానికి చేరుకుంది. ఇంకా రెండు రోజుల ఆటే మిగిలింది. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ టీమిండియాకు స్ఫూర్తి రగిలించేలా మాట్లాడారు. దీన్ని సెవన్ క్రికెట్ తమ ట్విటర్ ఖాతాలో పంచుకుంది.
‘‘గబ్బా టెస్టు చివరి రెండు రోజుల ఆటలో ఫలితం ఏదైనా కావొచ్చు. మా క్రికెటర్ల పట్ల ఎంతో గర్వపడుతున్నాం. ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చినప్పుడు అసలైన సవాళ్లు ఏంటో నాకు తెలిశాయి. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఈ సిరీస్ ఓ అద్భుతం. భారత ఆటగాళ్ల సంకల్పం, ధైర్యం, పోరాటం స్ఫూర్తిదాయకం’’
‘‘అయిదు నెలల నుంచి ఇంటికి దూరంగా ఉన్నారు. కోరుకోని ఫలితాలు ఎదురయ్యాయి. ప్రపంచమంతా చూస్తోంది. ఆటగాళ్లు గాయపడ్డారు. ఎన్నో ప్రతికూలతలు.. అయినా టీమిండియా అద్వితీయంగా పోరాడుతోంది. ట్రోఫీ సాధించడం కోసం అసాధారణంగా ఆడుతోంది. ఆస్ట్రేలియన్లు వాళ్ల జట్టును, ప్రత్యర్థులను గౌరవిస్తారని తెలుసు. ఈ సిరీస్లో భారత ఆటగాళ్లు చేసిన పోరాటాన్ని ఎన్నటికీ మరవలేరు’’ అని గావస్కర్ తెలిపారు.
తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధిచింది. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో భారత్ 36 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే అద్భుత పోరాటంతో రెండో టెస్టులో విజయ ఢంకా మోగించిన టీమిండియా మూడో టెస్టును డ్రాగా ముగించింది. ప్రస్తుతం నాలుగో టెస్టు గబ్బా మైదానంలో జరుగుతుంది.
ఇదీ చదవండి
కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
స్మిత్ ఔట్: ఆసీస్ ఆధిక్యం 229