ధైర్యానికే జయం!

ఆస్తికంగా ఆలోచిస్తే ధైర్యం తొలి జాడ పూజాదికాలలో కనిపిస్తుంది. ప్రతి మనిషీ దేవుడిని వేడుకునే కోరికల జాబితాలో ధైర్యమూ ఒకటి. ‘అస్మాకం సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం....’ ఈ సంకల్పంలో క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాలను ఒక వరుసలో చూస్తాం. అంటే మిగతా ఎన్ని ఉన్నా ధైర్యం తప్పకుండా మనిషికి ఉండి తీరాల్సిందే!

Published : 10 Jun 2021 01:53 IST

మనలోనే ఉండి మనల్ని ముందుకు నడిపే గొప్ప నేస్తం... ధైర్యం.
బాధల్లో మునిగిన వ్యక్తికి ధైర్యమే గొప్ప బలం.
ప్రమాదపుటంచుల నుంచి ఆనందాల బాటలోకి తెచ్చేది ధైర్యమే.
ఆధ్యాత్మిక, మనస్తత్వ శాస్త్ర పరంగానూ ధైర్యం అద్భుత ఆయుధం.
ఇదొక్కటి తోడుంటే ఎన్ని కష్టాలనైనా ఎదిరించొచ్చు.
అసలు మనిషి జీవితంలో ధైర్యం ప్రాధాన్యం ఏంటి?

ఆస్తికంగా ఆలోచిస్తే ధైర్యం తొలి జాడ పూజాదికాలలో కనిపిస్తుంది. ప్రతి మనిషీ దేవుడిని వేడుకునే కోరికల జాబితాలో ధైర్యమూ ఒకటి. ‘అస్మాకం సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం....’ ఈ సంకల్పంలో క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాలను ఒక వరుసలో చూస్తాం. అంటే మిగతా ఎన్ని ఉన్నా ధైర్యం తప్పకుండా మనిషికి ఉండి తీరాల్సిందే!

ఎందుకింత విలువ

గొప్ప సంపదల వరుసలో ధైర్యం ఉండటానికి కారణాన్ని భర్తృహరి సుభాషిత త్రిశతి వివరిస్తుంది. దేవతలు సముద్ర మథనం చేస్తున్నప్పుడు ముందుగా ఉద్భవించిన కౌస్తుభం తదితర మణిరత్నాలతో సంతోషించలేదు. భయంకర కాలకూటాన్ని చూసి భయపడలేదు. అమృతాన్ని సాధించేదాకా తమ ప్రయత్నాన్ని మానలేదు. ధైర్యవంతులు స్థిర చిత్తంతో సంకల్పించుకున్న పని నెరవేరే వరకూ విశ్రమించరు. ఇది ధైర్యవంతుడి సంకల్ప బలం. ధైర్యంలో ఇంత బలం ఉంది కనునే భగవంతుణ్ని కోరుకునే కోరికల్లో ఇదీ ఒకటిగా చేరింది. క్షేమంగా ఉండాలంటే స్థిర సంకల్పంతో స్థైర్యంగా ఉండాలి. అదే బుద్ధిపరంగా ధైర్యాన్ని కలిగిస్తుంది. ఆ బుద్ధి అభయాన్ని పొంది విజయం అందుకునేదాకా తోడుంటుంది.

అదే శత్రువు

ధైర్యం మనిషిని ఎంతగా ఎదగనిస్తుందో భయం అంతగా దిగజారుస్తుంది. అందుకే ధైర్యానికి ప్రధాన శత్రువు భయం అని రుషుల నుంచి నేటి మనస్తత్వ శాస్త్రవేత్తల దాకా వివరిస్తున్నారు. సాధారణంగా భయం  ఏదో ఒక కారణం వల్ల కలుగుతుంది. ఏదో జరుగుతుందన్న ఊహ వల్ల ఆందోళన తలెత్తుతుంది. రెండింటి మధ్యా కొద్దిపాటి తేడానే. కానీ ఇవి తెచ్చే అనర్థాలు అనంతం. అనవసర భయాందోళనలకు దూరంగా ఉంటే విజయాలన్నీ దాసోహం అంటాయి. అలాగే తన మీద తనకు నమ్మకం లేకపోవటమే భయానికి తొలి కారణం అంటారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. తనకెవరూ లేరని, ఉన్నా సాయం చెయ్యరనే అపోహ భీతికి మరో కారణమని పేర్కొంటారు. వీటిని జయించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి.

దైవం రూపంలో

దేవీభాగవతంలో సుప్రసిద్ధ చింతామణి గృహ వర్ణనలో ధైర్యం ప్రాధాన్యం కనిపిస్తుంది. మణి ద్వీపానికి వెళ్లే తోవలో వైడూర్య ప్రాకారం దాటాక దేవీ శక్తుల షోడశదళ పద్మం ఉంటుంది. ఇందులో పదహారు శక్తులకు పదహారు సౌధాలుంటాయి. కరాళి, వికరాళి, ఉమ, సరస్వతి, శ్రీ, దుర్గ, ఉష, లక్ష్మి, శ్రుతి, స్మృతి, ధృతి (ధైర్యం), శ్రద్ధ, మేధ, మతి, కాంతి, ఆర్య అనే పేర్లున్న వీరంతా నీలమేఘ వర్ణంతో కరవాలాలు ధరించి వేటకుక్కలను వెంటపెట్టుకుని యుద్ధప్రియులై ఉంటారు. వీరు జగన్మాతకు సేనానులు. బ్రహ్మాండ శక్తులన్నిటికీ నాయికలు. ఇంతటి గొప్ప శక్తుల వరుసలోనే మనిషిని ముందుకు నడిపించే ధైర్యం అనే శక్తి కూడా ఉండటం గమనించదగ్గ విషయం. అందుకే ధైర్యాన్ని దైవ లక్షణమని పెద్దలన్నారు.

ధైర్యమే లక్ష్మి

అష్టలక్ష్ముల్లో ధైర్యలక్ష్మి కూడా కనిపిస్తుంది. ఈమెనే వీరలక్ష్మి అనీ అంటారు. ఈ తల్లి ఎనిమిది చేతులతో ఎర్రటి దుస్తులు ధరించి, కమలం మీద కూర్చుని ఉంటుంది. చక్రం, విల్లు, బాణం, త్రిశూలం/ కత్తి లాంటి ఆయుధాలు చేబూని, అభయ, వరద ముద్రలతో ధైర్యదాయినిగా దర్శన మిస్తుంది.

భయం అనర్థం

వైజ్ఞానిక పరంగా చూస్తే, ప్రమాదం ముంచుకొచ్చి నప్పుడో, ఒత్తిడిలో ఉన్నప్పుడో దాన్ని ఎదుర్కోవటానికి కార్టిసాల్‌ హార్మోన్‌ శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. తర్వాత దీని స్థాయులు తగ్గిపోతాయి. అదే, అకారణంగా భయం, ఒత్తిడికి లోనవుతున్నప్పుడు కార్టిసాల్‌ స్థాయులు నిరంతరం ఎక్కువగానే ఉంటాయి. దీంతో ఆందోళన, దిగులు, తలనొప్పి, గుండెజబ్బులు, మతిమరుపు, అజీర్ణం, నిద్రలేమి, అధిక బరువు లాంటి సమస్యలెన్నో చుట్టుముడతాయి. అందుకే, అనవసర భయాందోళనలకు దూరంగా ఉండాలి.

అభయహస్తం అందుకే

దేవతా మూర్తుల్లో అభయహస్తాలూ, అభయ మూర్తులూ ఉండటానికి కారణం ఆశ్రితుడిలో ధైర్యం నింపటానికే. వేంకటేశ్వరస్వామి అభయహస్తం తన పాదాలను ఆశ్రయించాలని సూచిస్తుంది. అలా చేస్తే సంసార సాగరం నడుముల్లోతు మాత్రమే ఉండేలా చేస్తానంటున్నట్టు కనిపిస్తుంటుంది కటిహస్తం. మనలో ధైర్యం పెరగాలంటే పెద్దలు, గురువులు, దైవసమానులైన వారిని ఆశ్రయించాలి. వారి అనుభవాల అండ కొండంత ధైర్యాన్నిస్తుంది.

ధైర్యమే తోడుగా..

మార్కండేయుడి ఆయువు పదహారేళ్లే. కానీ, ఆ రాతను తిరగరాయించే శక్తి- భక్తితో కూడిన విశ్వాసం, ధైర్యం వల్లనే వచ్చింది. సాక్షాత్తూ యముడికే ముచ్చెమటలు పట్టించి మహాదేవుడి నుంచి చిరంజీవిగా వరం పొందాడు మార్కండేయుడు. తన నమ్మకం విషయంలో ప్రహ్లాదుడిది కూడా చెక్కుచెదరని ధైర్యం. అతని తండ్రి హిరణ్యకశిపుడి సూచనలతో రాక్షసులు శూలాలతో పొడిచారు. పాములతో కరిపించారు. ఏనుగులతో తొక్కించారు. కొండశిఖరం మీద నుంచి తోశారు. అయినా హరినామస్మరణతో మృత్యువును ఎదిరించాడు ప్రహ్లాదుడు. అందుకే ఎలాంటి క్లిష్టపరిస్థితులు ఎదురైనా భయపడిపోకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని పెద్దలు చెబుతారు.

- డా।। యల్లాప్రగడ మల్లికార్జునరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని