రథం కీర్తి పథం!

ఒకవైపు కలతలు, కల్లోలాలతో నిండిన మానవ జీవన రథం. మరోవైపు వాటన్నింటి నుంచీ గట్టెక్కించే విశ్వాసం కలిగిస్తూ వైభవంగా ముందుకు కదిలే జగన్నాయకుడి దివ్య రథం. ఇరువైపులా బలరామ సుభద్రల తేరులు... మొత్తంగా ప్రపంచంలోనే ఓ విశేష వేడుక పూరీలో ఏటా దర్శనమిస్తుంది. అయితే, ఈ రథయాత్ర ప్రారంభం, నిర్వహణలో ఆసక్తికర విశేషాలెన్నో...

Published : 08 Jul 2021 01:21 IST

జులై 12 పూరీ జగన్నాథుడి రథయాత్ర

ఒకవైపు కలతలు, కల్లోలాలతో నిండిన మానవ జీవన రథం. మరోవైపు వాటన్నింటి నుంచీ గట్టెక్కించే విశ్వాసం కలిగిస్తూ వైభవంగా ముందుకు కదిలే జగన్నాయకుడి దివ్య రథం. ఇరువైపులా బలరామ సుభద్రల తేరులు... మొత్తంగా ప్రపంచంలోనే ఓ విశేష వేడుక పూరీలో ఏటా దర్శనమిస్తుంది. అయితే, ఈ రథయాత్ర ప్రారంభం, నిర్వహణలో ఆసక్తికర విశేషాలెన్నో...

* పూరీ జగన్నాథ రథయాత్ర ఎలా మొదలైందనే దానికి ఒక కథ ప్రచారంలో ఉంది. కంసుడు ధనుర్యాగం నెపంతో కృష్ణ-బలరాములను చంపడానికి మధురకి ఆహ్వానించాడు. యోగమాయ రూపంలో ఉన్న సుభద్ర అన్నదమ్ములకు అతని పన్నాగం గురించి చెప్పింది. కంసుడి పీచమణిచేందుకు వారు ముగ్గురూ మధురకి వెళ్లే ఘట్టమే జగన్నాథుని మొదటి రథయాత్ర అయ్యింది. కంస వధ అనంతరం చెరలో ఉన్న తమ తల్లిదండ్రుల్ని అన్నదమ్ములు విడిపించారు. అప్పటి నుంచి ఏడాదిలో ఒకసారి సుభద్ర సమేతంగా అన్నదమ్ములు మధురకి రథయాత్ర చేయడం ఆనవాయితీగా మారింది. మరో కథనం ప్రకారం తాను పుట్టిన చెరసాలను ఏడాదికి ఒకసారి చూడటానికి కృష్ణుడు ఈ రథయాత్రను ఏర్పరచాడని తెలుస్తోంది. ఆషాఢ శుక్ల విదియ నాడు మధురకి బయలుదేరి అక్కడికి చేరడానికి కృష్ణ-బలరాములకి ఎనిమిది రోజులు పట్టింది. అందుకే దీన్ని ఎనిమిది రోజుల పర్వంగా కొనసాగిస్తున్నారు. ఈ రథయాత్ర కేవలం పూరీకే పరిమితం కాదు. 192 దేశాల్లో ఈ ఉత్సవం ఏటా జరుగుతోంది. 

* పూరీ ఆలయంలో ఓ పక్కగా ఉండే లక్ష్మీదేవిని స్థానికులు ‘మాసి మా’ అని వ్యవహరిస్తున్నారు. 1575 నుంచి జగన్నాథుడి రథయాత్రను వార్షికంగా నిర్వహిస్తున్నారు. అయితే విదేశీ దాడుల నేపథ్యంలో 32 సార్లు దీన్ని నిర్వహించలేదు. ఈ ఏడాది జరిపే రథయాత్ర 414వది. పూరీ ఆలయం మహానది తీరంలో ఉంది. రథయాత్రలో భాగంగా మూడు రథాల్లో విగ్రహాలను మాసి మా ఆలయం నుంచి మహానది ఒడ్డు వరకు తీసుకెళతారు. అక్కడి నుంచి మూడు పడవల్లో విగ్రహాలను తీసుకుని నది దాటతారు. విగ్రహాలను మళ్లీ ఒడ్డుకు తెచ్చిన తర్వాత పాత వాటిలో కాకుండా, ఉపయోగించని మరో మూడు కొత్త రథాల్లో ఊరేగిస్తూ మాసి మా ఆలయం వరకు తీసుకొస్తారు. ఈ మొత్తం ఊరేగింపు దూరం మూడు కిలోమీటర్లు. ఈ మూడు అనేది భూత-వర్తమాన-భవిష్యత్‌ కాలాలకు సంకేతం. ఈ మూడు కాలాలకు సంబంధించిన కార్య ఫలితాల్లో జగన్నాథుడి చల్లని చూపులు అందరి మీదా ఉండాలనే ఉద్దేశంతో అన్నీ మూడు ఉండేలా చూస్తున్నారు. 

* రథాల నిర్మాణంలోనూ ఆధ్యాత్మికతను రంగరించారు. జగన్నాథుడు ఊరేగే రథం పేరు నందిఘోష్‌. దీనికుండే 16 చక్రాలు జగన్నాథుడు షోడశ కళానిధి అని చెబుతాయి. ఈ రథానికి ఉండే నాలుగు తెల్లని అశ్వ ప్రతిమలు శాంతి-సామరస్యానికి ప్రతీకలు. పూజనీయ సర్పాలలో ఒకడైన శంఖచూడుని భార్యను ఈ రథాన్ని లాగే తాడుగా పేర్కొంటారు. గరుడుడు ఈ రథానికి రక్షకుడు. రథ గోపురాన్ని శక్తి-బుద్ధులకు చిహ్నమైన ఎరుపు-పసుపు రంగులతో అలంకరిస్తారు. త్రైలోక్యమోహన అనే జెండా దీని మీద ఉంటుంది. ఈ రథసారథి దారకుడు. అంటే దారి తెలిసినవాడని అర్థం. 

* బలరాముడు ఊరేగే రథం పేరు తాళధ్వజ్‌. దీనికి ఉన్న 14 చక్రాలు చతుర్దశ భువనాలకి ప్రతీక. న్యాయ-ధర్మాలకు ప్రతీకమైన నలుపు రంగు గుర్రపు ప్రతిమలు నాలుగు ఈ రథానికి ఉంటాయి. వాసుకిని ఈ రథాన్ని లాగే తాడుగా పేర్కొంటారు. వాసుదేవుడు దీనికి రక్షకుడు. శక్తి-న్యాయ సూచకాలైన ఎరుపు-నీలం రంగులున్న అలంకారంతో ఈ రథ గోపురం ఉంటుంది. ఉన్నాని అనే జెండా దీని మీద అమరుస్తారు. మాతలి రథసారథి.

* సుభద్రాదేవి ఊరేగే రథం పేరు దేవదళన్‌. ఇది 12 చక్రాలతో ద్వాదశ రుద్రులను సూచిస్తుంది. సంహార-శక్తి సూచకమైన భద్రకాళిని తలపించే విధంగా దీనికి నాలుగు ఎరుపు రంగు గుర్రపు ప్రతిమలుంటాయి. రథాన్ని లాగే తాడుగా స్వర్ణ చూడ నాగినిని నిర్దేశించారు. జయదుర్గ ఈ రథానికి రక్షణ దేవత. రథ గోపురానికి శక్తితో శోకాన్ని హరించే ఎరుపు-నలుపు రంగులతో కూడిన అలంకారాలు చేస్తారు. నాదాంబిక అనే పేరు కలిగిన ధ్వజం దీనిపైన ఉంటుంది. అర్జునుడు దీనికి రథసారథి.  
* రథయాత్రలో ముందుగా బలరాముడు, తర్వాత సుభద్రాదేవి, చివరిగా జగన్నాథుడి రథాలు బయటికి తీస్తారు. స్త్రీ శక్తిని ఎప్పుడూ రక్షిస్తుండాలన్న ఆంతర్యం ఇందులో కనిపిస్తుంది.

సుభద్ర ఎవరు? 

యశోద గర్భం నుంచి జన్మించగానే, వసుదేవుడి ద్వారా దేవకి దగ్గరికి చేరిందే ఈ సుభద్ర. కంసుడు ఈమెను సంహరించడానికి పైకి ఎగరేయగానే అతణ్ని హెచ్చరించి మాయమై పోయింది. తర్వాత కృష్ణుణ్ని పలు బాలారిష్ఠాల నుంచి బయటపడేసినట్లు చెబుతారు.  ఈ కారణం వల్లనే ఆమె రథయాత్రలో అన్నదమ్ముల సరసన ఊరేగుతూ పూజలందుకొంటోంది. కొవిడ్‌ నేపథ్యంలో ఈ ఏడాదీ భక్త ప్రభంజనం లేకుండానే జగన్నాథుడి రథయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు.

- చల్లా జయదేవ్‌ 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని